'గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఆ నలుగురే..' : సూర్య
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
By - Medi Samrat |
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ ఘనతను సాధించిన మూడో కెప్టెన్‌గా అతను నిలిచాడు. దీనికి ముందు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల కెప్టెన్సీలో భారత్ రెండు వరల్డ్ కప్‌లను గెలిచింది.
అయితే, సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించింది.. ఎందుకంటే రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు సూర్య జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా లేడు.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో సూర్యకుమార్ కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉండటం వల్లే అతనికి భారత కెప్టెన్సీ లభించిందని కొందరు భావించారు. అయితే, తనను టీ20ఐ కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి దోహదపడిన నలుగురి పేర్లను సూర్య ఇప్పుడు వెల్లడించాడు. ఆశ్చర్యకరంగా, ఆ నలుగురిలో గౌతమ్ గంభీర్ పేరు లేదు.
మాజీ బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మల నమ్మకం వల్లే తనకు పదోన్నతి లభించి.. తను కెప్టెన్‌గా ఎంపికయ్యానని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.
శ్రీలంక సిరీస్‌కు మూడు నాలుగు రోజుల ముందు, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జైభాయ్ నాకు ఫోన్ చేశారు. సమీప భవిష్యత్తు కోసం నన్ను టీ20 జట్టు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆయన నాకు చెప్పారు. అవును, నాకు మొదట ఫోన్ చేసింది ఆయనే. అయితే ఆ సమయంలో ఇదంతా రోహిత్ భాయ్, అజిత్ భాయ్ కలిసి ప్లాన్ చేశారని నాకు ఖచ్చితంగా తెలుసు. గౌతమ్ భాయ్ తర్వాత కలిశారు. ఆయన, అప్పటి కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ సార్‌తో కలిసి జై భాయ్‌తో ఈ విషయం చర్చించారు. అప్పుడు భవిష్యత్తులో నేనే భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని వారు నిర్ణయించారు."
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ నేతృత్వంలో ఆడిన 52 మ్యాచ్‌లలో టీమిండియా 42 గెలిచింది. అతని విజయ శాతం 80కి పైగా ఉంది. కెప్టెన్‌గా శాశ్వతంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి జట్టు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కూడా ఓడిపోలేదు. 35 ఏళ్ల సూర్యకుమార్.. భారత టీ20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన రోహిత్ శర్మ కంటే కేవలం ఎనిమిది విజయాల వెనుక ఉన్నాడు.