రోహిత్ శర్మ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు..!

సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో టీమిండియా శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుని రోహిత్ శర్మను పక్కన పెట్టింది

By Medi Samrat  Published on  3 Jan 2025 2:34 PM IST
రోహిత్ శర్మ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు..!

సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో టీమిండియా శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుని రోహిత్ శర్మను పక్కన పెట్టింది. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ పేలవమైన ఫామ్ కారణంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని టాస్ సమయంలో బుమ్రా చెప్పాడు. అయితే, భారత మాజీ కెప్టెన్, గ్రేట్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ చెప్పేది వేరేలా ఉంది. రోహిత్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడని.. ఇప్పుడు రోహిత్ లేకుండా భారత్ ముందుకు సాగాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్ గౌతం గంభీర్, రోహిత్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. మెల్‌బోర్న్ టెస్టులో ఓడిపోవడంతో గంభీర్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పటి నుంచి రోహిత్ చివరి టెస్టు మ్యాచ్ ఆడకపోవచ్చని.. ఈ మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోతే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవాలనే కల కూడా చెదిరిపోతుంది. ఒకవేళ భారత్ గెలిచినా శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవాల్సి ఉంటుంది. అలా జ‌రిగితే భారత్ ఫైనల్ చేరవచ్చు.. కానీ ఇది కష్టమని గవాస్కర్ భావిస్తున్నాడు, ఒకవేళ టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకోకపోతే.. మెల్‌బోర్న్ టెస్టు రోహిత్‌కి చివరి టెస్టు కానుంది. ఎందుకంటే టీమ్ ఇండియా ఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడు.

స్టార్ స్పోర్ట్స్‌లో గవాస్కర్ మాట్లాడుతూ.. "బహుశా భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించకపోవచ్చని నేను భావిస్తున్నాను. మెల్‌బోర్న్ టెస్టు రోహిత్‌కి చివరి టెస్టు అని నేను భావిస్తున్నాను. తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇంగ్లాండ్ సిరీస్ నుండి ప్రారంభమవుతుంది. దీనికి టీమ్ ఇండియా 2027 ఫైనల్స్ వరకు ఆడగల ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకుంటుద‌ని అన్నాడు. భారత్ ఫైనల్ చేరుతుందా లేదా అనేది వేరే విషయం.. అయితే సెలక్షన్ కమిటీ కూడా అదే చేస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి రోహిత్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ని చూశామని నేను భావిస్తున్నాను అని అన్నాడు.

భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సునీల్ గవాస్కర్‌తో ఏకీభవిస్తూ.. ఒకవేళ స్వదేశంలో టెస్ట్ సిరీస్ రాబోతున్నట్లయితే, అతను కొనసాగాలని ఆలోచించేవాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్ తర్వాత అతను రిటైర్ అవుతాడని అనుకుంటున్నాను. అతని వయస్సు 38 సంవత్సరాలు, ఏ మాత్రం చిన్నవాడు కాదు. భారత్‌లో యువ ఆటగాళ్లు లేరని కాదు. భారత్‌లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు జట్టును నిర్మించడానికి సమయం ఆసన్నమైంది, ఇది కఠినమైన నిర్ణయం అని ఏర్కొన్నాడు.

Next Story