పక్షిలా క్యాచ్ పట్టిన స్మిత్‌.. షాక్‌లో అయ్య‌ర్‌.. వీడియో వైర‌ల్‌

Steve Smith Takes a Brilliant Catch to Dismiss Shreyas Iyer. భార‌త్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో స్టీవ్ స్మిత్ చాలా

By Medi Samrat  Published on  29 Nov 2020 11:23 AM GMT
పక్షిలా క్యాచ్ పట్టిన స్మిత్‌.. షాక్‌లో అయ్య‌ర్‌.. వీడియో వైర‌ల్‌

భార‌త్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో స్టీవ్ స్మిత్ చాలా క‌సిగా ఆడుతున్నాడు. రెండు వ‌న్డేల్లోనూ సెంచ‌రీల‌తో అల‌రించిన స్మిత్‌.. ఇక ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్‌కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 5 ఫోర్లతో 38) నిరాశగా వెనుదిరిగాడు. హెన్రీక్స్ బౌలింగ్‌లో అయ్యర్ మిడివికెట్‌ మీదుగా షాట్ ఆడగా.. ఆ దిశలో సర్కిల్‌ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. రెప్పపాటు సమయంలో అచ్చం పక్షిలా ఎగిరి వెనక్కి డైవ్ చేస్తూ బంతిని అతను అందుకున్న తీరు ఔరా అనిపించింది. ఇక స్మిత్ సూపర్ ఫీల్డింగ్‌కు క్రీజులో ఉన్న కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లంతా నోరెళ్లబెట్టారు. శ్రేయస్ అయ్యర్ అయితే బిత్తరపోయి.. నిరాశగా వెనుదిరిగాడు. దీంతో భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం స్మిత్ ప‌ట్టిన క్యాచ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 60 పరుగుల వద్ద ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కోహ్లి, అయ్యర్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరిద్దరు నిలదొక్కుకొని ప్రమాదకరంగా మారుతున్న దశలో స్మిత్‌ అద్భుత క్యాచ్‌తో శ్రేయాస్‌ అయ్యర్‌ వెనుదిరగడంతో 153 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో 190 పరుగులు చేసింది. కోహ్లి 75, రాహుల్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) మెరుపు సెంచ‌రీతో రాణించగా.. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివరలో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు‌) విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.




Next Story