ఫామ్‌లోకి వచ్చా.. ఇక నన్ను ఆపండి చూద్దాం
Steve Smith says he is starting to rediscover his form. టీమ్ఇండియాతో సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్ అభిమానులకు శుభవార్త
By Medi Samrat
టీమ్ఇండియాతో సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్ అభిమానులకు శుభవార్త చెప్పాడు స్టీవ్ స్మిత్. తాను మునపటి ఫామ్ అందుకున్నట్లు చెప్పుకొచ్చాడు ఈ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్. కరోనా తరువాత స్టీవ్ స్మిత్ పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ లో 14 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 3 అర్థశతకాలతో 311 పరుగులు మాత్రమే చేశాడు. కాగా.. భారత్‌తో సిరీస్‌కు ముందు తాను ఫామ్‌లోకి వచ్చానని స్మిత్ చెప్పాడు.
'గత రెండు మూడు రోజులుగా నేను టచ్‌లోకి వచ్చా. దీన్ని వివరించడం కొంచెం కష్టమే. అయితే నేను మునపటి లయను అందుకున్నా. గతంలోలాగా అలవోకగా షాట్లు ఆడుతున్నా. నేను ప్రయత్నించే ప్రతీ షాట్ క్లిక్ అవుతుంది. నా మునపటి రిథమ్ అందుకున్నా. ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అయితే గత నాలుగు నెలలుగా రాణించలేకపోవడానికి గల కారణం తెలియలేదు. అయితే కరోనా కారణంగా ఎక్కువ కాలం బ్యాటింగ్ చేయకపోవడమే కారణం కావచ్చు.
ఐపీఎల్ జరిగినన్ని రోజులు నా ఆటపై అసంతృప్తితో ఉన్నా. మెగా ఈవెంట్‌లో సరైన లయను అందుకోలేకపోయా. అయితే.. ఇక్కడికి వచ్చాక నాలో కొత్త ఉత్తేజం పుట్టుకొచ్చింది. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేయగలననే నమ్మకం కలిగింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నా. పెద్ద టోర్నీల్లో నేను బాగా ఆడడానికి ప్రయత్నిస్తా. దాంతోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. అలాంటి సమయాల్లో నాలో తెలియని శక్తి ఏదైనా ఉందేమో తెలియదు అని స్మిత్ చెప్పాడు.
2017-18 యాషెస్ సిరీస్ ముందు కూడా ఇలానే చెప్పిన స్మిత్ ఆ సిరీస్‌లో 687 రన్స్ చేశాడు. దాంతో ఆసీస్ 4-0 సిరీస్ గెలిచింది. ఇదిలా ఉండగా.. భారత్, ఆస్ట్రేలియాలు ఈ నెల 27 నుంచి మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే.