మరో స్టార్ బౌలర్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టోర్నీ నుంచి వైదలుగుతూ షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీకి తుది జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, ఆ జట్టు ముగ్గురు పెద్ద పేసర్లు లేకుండానే టోర్నీ ఆడనుంది. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాలతో తన పేరును టోర్నీ నుండి ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. గాయం కారణంగా పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. గత వారం గాలేలో శ్రీలంకతో జరిగిన చివరి టెస్టులో స్టార్క్ కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. స్టార్క్ ఎడమ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు.
మిచెల్ నిర్ణయాన్ని తాము అర్థం చేసుకున్నామని, గౌరవిస్తున్నామని సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్క్, కమ్మిన్స్, హేజిల్‌వుడ్ లేకపోవడం వల్ల ఫాస్ట్ బౌలర్లు స్పెన్సర్ జాన్సన్, నాథమ్ ఎల్లిస్, సీన్ అబాట్, బెన్ ద్వార్షిస్ ఛాంపియన్స్ ట్రోఫీకి చివరి 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నారు. కూపర్ కొన్నోలీ ట్రావెలింగ్ ప్లేయర్‌గా ఉన్నాడు. స్పెన్సర్ జాన్సన్ కేవలం రెండు ODIలు, 8 T20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. స్టార్క్ స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా కనిపించనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌తో, ఆ తర్వాత దక్షిణాఫ్రికా (ఫిబ్రవరి 25) ఆఫ్ఘనిస్తాన్ (ఫిబ్రవరి 28)తో ఆడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు..
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మథ్యూ షార్ట్.