శ్రీలంక తొలి టెస్టు కెప్టెన్ బందుల వర్ణపుర సోమవారం కన్నుమూశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 68 ఏళ్ల వర్ణపుర దేశం తరుపున నాలుగు టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. వర్ణపుర మరణంపై శ్రీలంక క్రికెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్ తరపున వర్ణపుర కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. 68 ఏళ్ల వర్ణపుర 1970లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 1973-74 సీజన్‌లో పాకిస్తాన్ తో జరిగిన అండర్ -25 సిరీస్‌లో వర్ణపుర ఫస్ట్-క్లాస్ కెరీర్ మలుపు తిరిగింది.
ఆపై.. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన 1975 వరల్డ్ కప్ గేమ్‌లో మాజీ ఓపెనర్ తన వన్డే అరంగేట్రం చేశాడు. 1979లో జరిగిన తదుపరి ప్రపంచకప్‌లో వర్ణపుర శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌పై విజయం సాధించి పెట్టాడు. ఇక 1982లో కొలంబోలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో వర్ణపుర శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను టెస్టుల్లో శ్రీలంక తరుపున తొలి డెలివరీని ఎదుర్కొన్నాడు. అలాగే టెస్ట్ క్రికెట్‌లో శ్రీలంక తొలి పరుగును వర్ణపురనే సాధించాడు.