లంక క్రికెట‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నేపై ఏడాది నిషేదం

Sri Lanka Cricket suspend Chamika Karunaratne from all forms of cricket.శ్రీలంక క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 4:54 AM
లంక క్రికెట‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నేపై ఏడాది నిషేదం

శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆటగాళ్ల ఒప్పందంలోని అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆల్‌రౌండ‌ర్ చ‌మిక క‌రుణ‌ర‌త్నేపై ఏడాది పాటు నిషేదం విధించింది. అంతేకాకుండా 5 వేల డాల‌ర్ల జ‌రిమానా కూడా విధించింది.

ఇటీవల ఆస్ట్రేలియాలో ముగిసిన T20 ప్రపంచకప్ సందర్భంగా ప్లేయర్ అగ్రిమెంట్‌లోని పలు నిబంధనలను చమికా కరుణరత్నే ఉల్లంఘించాడు. దీనిపై లంక క్రికెట్ బోర్డు ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన ఓ క‌మిటీని నియ‌మించింది. ప్యానెల్ విచార‌ణ సంద‌ర్భంగా క‌రుణ ర‌త్నె తాను నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన‌ట్లు ఒప్పుకున్నాడు. దీంతో ప్యానెల్ త‌న నివేదిక‌ను SLC ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందించింది.

దీనిపై లంక క్రికెట్ బోర్డు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవల ముగిసిన ఐసిసి టి 20 ప్రపంచ కప్ సందర్భంగా ఆటగాళ్ల ఒప్పందంలోని అనేక నిబంధనలను జాతీయ కాంట్రాక్ట్ పొందిన చ‌మికా క‌రుణ‌ర‌త్నే ఉల్లంఘించాడు. ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్ ముందు త‌న త‌ప్పిదాన్ని అంగీక‌రించాడు. దీంతో అత‌డిపై ఏడాది పాటు నిషేదం విధించ‌డంతో పాటు 5000 అమెరిక‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధిస్తున్నాం. అని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రుణ‌త్నే ఓ క్యాసినో కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్లు తెలిసింది. అంతేకాకుండా ప‌లు నిబంధ‌న‌లు కూడా అత్రిక‌మించాడు. మంచి ఫామ్‌లో ఉన్న క‌రుణ ర‌త్నె ఏడాది పాటు క్రికెట్‌కు దూరం కావ‌డం అత‌డి కెరీర్‌కు పెద్ద ఇబ్బంది చెప్ప‌వ‌చ్చు. నిషేదం అనంత‌రం అత‌డు జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటాడో లేదో చూడాలి మ‌రి.

Next Story