ఉత్కంఠ పోరులో లంక విజయం
Sri Lanka beat India by 4 wickets.నువ్వా నేనా అన్నట్లు చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన రెండో టీ20లో
By తోట వంశీ కుమార్ Published on 29 July 2021 2:25 AM GMTనువ్వా నేనా అన్నట్లు చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. కరోనా కారణంగా ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఉన్న వనరులతోనే బరిలోకి దిగింది భారత్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్(40; 42 బంతుల్లో 5 పోర్లు) రాణించగా.. దేవదత్ పడిక్కల్ (29), రుతురాజ్ గైక్వాడ్ (21) ఫర్వాలేదనిపించారు. మందకొడి పిచ్‌పై పరుగులు చేసేందుకు బ్యాట్స్‌మెన్లు చాలా కష్టపడ్డారు. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ కూడా స్లోగా మారింది. భారత ఇన్నింగ్స్‌లో మొత్తంగా ఏడు పోర్లు, ఓ సిక్స్ మాత్రమే నమోదయ్యాయి. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. అకిల ధనంజయ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక నిర్ణయాత్మకమైన చివరి టీ20 నేడు జరగనుంది.