చివ‌రి మ్యాచ్ ఓడినా.. సిరీస్ గెలిచిన భార‌త్

Sri Lanka beat India by 3 wickets.ఎట్ట‌కేల‌కు లంకు ఓదార్పు విజ‌యం. చివ‌రిదైన మూడో వ‌న్డేలో శ్రీలంక మూడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 2:38 AM GMT
చివ‌రి మ్యాచ్ ఓడినా.. సిరీస్ గెలిచిన భార‌త్

ఎట్ట‌కేల‌కు లంక‌కు ఓదార్పు విజ‌యం. చివ‌రిదైన మూడో వ‌న్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టుపై గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం ఆరంభంకానుంది.

సిరీస్ గెల‌వ‌డంతో నామ‌నామ‌త్ర‌మైన మూడో వ‌న్డేలో టీమ్ఇండియా అనేక మార్పుతో బ‌రిలోకి దిగింది. సంజుశాంస‌న్‌, రాహుల్ చ‌హ‌ర్‌, నితీష్ రాణా, కృష్ణ‌ప్ప గౌత‌మ్‌, చేత‌న్ స‌కారియా వ‌న్డే అరంగ్రేటం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్(13) తీవ్రంగా నిరాశపరిచాడు. చమీర బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ సంజూ శాంసన్‌(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46)తో కలిసి పృథ్వీ షా(49 బంతుల్లో 8 ఫోర్లు 49) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు తమదైన శైలిలో బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 66 రన్స్ చేసింది. క్రీజులో కుదరుకున్న ఈ జోడీని కెప్టెన్ డసన్ షనక విడదీశాడు. హాఫ్ సెంచరీ ముంగిట పృథ్వీషాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

షా రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన సంజూ శాంసన్‌ కూడా క్యాచ్ ఔటయ్యాడు. జయవిక్రమార్క బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీకి ప్రయత్నించిన సంజూ.. ఫీల్డర్ ఫెర్నాండోకు చిక్కాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 7 ఫోర్లతో 40) ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చినా రివ్యూతో బయటపడ్డాడు. ఆ వెంటనే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. అనంతరం 47 ఓవర్లకు కుదించి ఆటను రీస్టార్ట్ చేయగా.. సూర్య తన మార్క్ షాట్స్‌తో జోరు కనబర్చాడు. కానీ శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో భార‌త జ‌ట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 43.1 ఓవర్లలో 225 పరుగులకు కుప్పకూలింది.

ఛేజింగ్‌లో శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి నెగ్గింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు గెలుపు బాటలు వేశారు. సూర్యకుమార్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు దక్కింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆదివారం మొదలవుతుంది.

Next Story