ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై లంక గెలుపు
Sri Lanka beat Bangladesh by 2 wickets in thriller.శ్రీలంక,బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు
By తోట వంశీ కుమార్ Published on 2 Sep 2022 4:30 AM GMT
ఆసియాకప్-2022 టోర్నీలో భాగంగా శ్రీలంక,బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. గ్రూప్-బిలో రెండో సూపర్-4 బెర్తు కోసం ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఓవర్ ఓవర్ కు ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. టీ 20 క్రికెట్‌లో ఉన్న అసలు సిసలు మజాను చూపించింది. చివరకు 2 వికెట్ల తేడాతో లంక విజయం సాధించింది. దీంతో శ్రీలంక సూపర్-4కి అర్హత సాధించగా.. బంగ్లాదేశ్ ఇంటి ముఖం పట్టింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫిఫ్ హుస్సేన్ (39; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెహదీ హసన్ (38; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహ్మదుల్లా(27), షకీబ్ (24)లు రాణించారు. లంక బౌలర్లలో చమిక కరుణ రత్నె, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టగా మధుశంక, తీక్షణ, అసిత ఫెర్నాండో తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(60), కెప్టెన్ శనక (45) లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో ఆల్‌రౌండర్ కరుణరత్నే(16), అసిత ఫెర్నాండో(10) ధాటిగా ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో బాడోత్ హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ రెండు, ముస్తాఫిజుర్, మెహెదీ హసన్ చెరో వికెట్ తీశారు.