మోడల్ తానియా ఆత్మహత్య.. సన్ రైజర్స్ ఆటగాడికి ఆఖరి ఫోన్ కాల్

గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వెసు రోడ్‌లోని హ్యాపీ ఎలిగాన్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 28 ఏళ్ల మోడల్ తానియా సింగ్ మరణం మిస్టరీగా మారింది.

By Medi Samrat  Published on  21 Feb 2024 7:15 PM IST
మోడల్ తానియా ఆత్మహత్య.. సన్ రైజర్స్ ఆటగాడికి ఆఖరి ఫోన్ కాల్

గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని వెసు రోడ్‌లోని హ్యాపీ ఎలిగాన్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 28 ఏళ్ల మోడల్ తానియా సింగ్ మరణం మిస్టరీగా మారింది. గత ఒకటిన్నర, రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్‌ను అభ్యసిస్తున్న తానియా ఫిబ్రవరి 20, మంగళవారం నాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తానియా మరణం ఆమె కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు ఆధారాల కోసం వెతుకుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

విచారణ కొనసాగుతూ ఉండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న క్రికెటర్ అభిషేక్ శర్మ పేరు ఈ కేసుకు సంబంధించి బయటపడిందని పోలీసులు ఆజ్‌తక్‌కి ధృవీకరించారు. సూరత్ పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన మోడల్ తానియా సింగ్ సీడీ-ఆర్ నివేదికను విడుదల చేశారు. అందులో మోడల్ తానియా సింగ్.. ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్ అభిషేక్ శర్మతో కాంటాక్ట్ అయిందని తెలుస్తోంది. తానియా మరణించిన తర్వాత పోలీసులు ఆమె ఫోన్‌ కాంటాక్ట్స్‌ను పరిశీలించగా ఆఖరిసారి తానియా చేసిన ఫోన్‌ అభిషేక్‌కే అని తేలింది. కాల్‌తో పాటు అభిషేక్‌కు మెసేజ్‌ చేసినా అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సూరత్‌ పోలీసులు తెలిపారు. కాల్‌ డేటా ఆధారంగా సూరత్‌ పోలీసులు అభిషేక్‌కు నోటీసులు పంపించారు. అభిషేక్‌ను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో SRH తరపున ఆడాడు. 23 ఏళ్ల అభిషేక్ శర్మ 2022 సీజన్‌ లో అద్భుతంగా ఆడాడు. అతను ఆ సీజన్ లో 426 పరుగులు చేశాడు.

Next Story