భారత్-సౌతాఫ్రికా సిరీస్ పై దక్షిణాఫ్రికా బోర్డు కీలక నిర్ణయం

Spectators will not get entry in Boxing Day Test.ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా ఇప్పటికే వెళ్ళింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2021 7:10 AM GMT
భారత్-సౌతాఫ్రికా సిరీస్ పై దక్షిణాఫ్రికా బోర్డు కీలక నిర్ణయం

ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా ఇప్పటికే సౌతాఫ్రికాకు వెళ్ళింది. అక్కడ భారత జట్టు ప్రాక్టీస్ లో తలమునకలైంది. అతి త్వ‌ర‌లో టెస్టు, వ‌న్డే సిరీస్‌లు ఆడ‌బోతోంది. అక్క‌డ ఒమిక్రాన్ కేసులు తీవ్రంగా ఉండ‌డంతో ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డిసెంబ‌ర్ 26 నుంచి 30 వ‌ర‌కు సెంచురియాన్‌లో జ‌ర‌గ‌బోయే తొలి టెస్టు మ్యాచ్ ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకుంది. మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల‌ను విక్ర‌యించ‌లేదు. జ‌న‌వ‌రి 3 నుంచి 7 వ‌ర‌కు వాండ‌ర‌ర్స్ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే రెండో టెస్టు మ్యాచ్‌లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాలా లేదా అనే అంశంపై క్రికెట్ బోర్డు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత క‌రోనా పరిమితుల కారణంగా 2,000 మంది అభిమానులను అనుమతించే అవకాశం ఉన్నప్పటికీ. కొంతమంది సూట్ హోల్డర్‌లు, ప్రతినిధులు మాత్రమే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించగలరు. నిర్వాహకులు వచ్చే వారం క‌రోనాకి సంబంధించి ప్రభుత్వ నిబంధనలలో ఏమైనా మార్పులు వస్తాయో లేదో వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికి, జనవరి 3 నుండి వాండరర్స్‌లో ప్రారంభమయ్యే రెండవ టెస్ట్‌కు కూడా టిక్కెట్‌లు ఏవీ విక్రయించబడలేదు. "దయచేసి గమనించండి, దక్షిణాఫ్రికా మరియు భారతదేశం మధ్య #ఇంపీరియల్ వాండరర్స్ స్టేడియంలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయబడలేదు" అని స్టేడియం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా పేర్కొంది. అభిమానులను అనుమతిస్తారో లేదో స్పష్టంగా తెలియదు. మేము తదుపరి ప్రకటనలను తగిన సమయంలో చేస్తామని తెలిపారు.

టీమిండియా డిసెంబ‌ర్ 17న దక్షిణాఫ్రికా చేరుకొని ఒక‌రోజు క్వారంటైన్‌లో గ‌డిపిన త‌రువాత ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అంత‌కుముందు భార‌త్‌లోనే టీమిండియా జ‌ట్టు స‌భ్యులంద‌రికీ మూడు రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉంచి మూడుసార్లు క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు. ప్రస్తుతానికి అయితే ఎవరికీ కరోనా పాజిటివ్ అనే ప్రకటన రాలేదు.

Next Story