సెంచరీతో చెలరేగిన రూసో.. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
South Africa won by 104 runs against Bangladesh in T20 World Cup.దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రూసో శతకం
By తోట వంశీ కుమార్ Published on 27 Oct 2022 8:01 AM GMTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్2022లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రూసో శతకంతో చెలరేగిపోయాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 16.3ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్, కెప్టెన్ బవుమా 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (63; 38 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లు) తో జతకలిసిన రూసో(109; 56 బంతుల్లో 7ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. వీరిద్దరు బంగ్లా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా రూసో ఆకాశమే హద్దుగా అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఈ క్రమంలో శతకాన్ని అందుకున్నాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. కాగా.. రూసోకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండో శతకం కావడం విశేషం. భారత పర్యటనలో ఆఖరి టీ20లో టీమ్ఇండియాపై 48 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలించాడు.
డికాక్, రూసో ధాటికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ రెండు వికెట్లు తీయగా.. తస్కీన్ అహ్మద్, మహ్‌మూద్, హుస్సేన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ సఫారీలకు పోటిని ఇవ్వలేకపోయింది. బంగ్లా బ్యాటర్లలో లిట్టన్ దాస్ 34 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లో అనిరిచ్ నోర్జే నాలుగు వికెట్లు పడగొట్టగా.. తబ్రెయిన్ షంసీ మూడు, రబాడ, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీశారు.