మూడు టెస్టుల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-1 తో సొంతం చేసుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ ను భారత్ గెలుచుకోగా.. ఆ తర్వాతి రెండు టెస్ట్ మ్యాచ్ లలోనూ దక్షిణాఫ్రికా వరుస విజయాలను అందుకుని భారత్ కు సిరీస్ దక్కకుండా చేసింది. మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ ను క్యాష్ చేసుకున్న సఫారీలు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. 212 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వాన్ డర్ డుస్సెన్ 41, టెంబా బవుమా 32 పరుగులతో జట్టును ఎటువంటి కుదుపులు లేకుండా గెలిపించుకున్నారు. కీగాన్ పీటర్సన్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ కు విజయానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది.
పీటర్సన్ స్లిప్స్ లో ఇచ్చిన క్యాచ్ ను పుజారా జారవిడవడం దక్షిణాఫ్రికాకు ప్లస్ గా మారింది. వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గి సిరీస్ ను గెలుచుకుంది. కీగన్ పీటర్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది.