ప్చ్..! సంజు శాంసన్ పోరాడినా
South Africa beats India by 9 runs in first ODI.ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2022 7:53 AM ISTదక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను గెలిచిన రోహిత్ సేన పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా బయలు దేరగా.. యువ ఆటగాళ్లతో కూడిన ధావన్ నేతృత్వంలోని టీమ్ఇండియా వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. ఓటమితో వన్డే సిరీస్‌ను మొదలెట్టింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సంజు శాంసన్ జట్టును గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్‌లో 31 పరుగులు అవసరం కాగా.. శాంసన్ తొలి మూడు బంతులను 6,4,4 బాది మ్యాచ్‌పై ఆఖలు రేపాడు. అయితే.. తరువాతి మూడు బంతుల్లో 0,4,1 రావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్; 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (75; 63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశకాలతో రాణించగా.. క్వింటన్ డికాక్(48) కూడా మెరిశాడు. భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లను వదిలివేయడం కూడా దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కలిసి వచ్చింది. క్లాసన్, మిల్లర్‌లు ఐదో వికెట్ కు 17.4 ఓవర్లలో అభేధ్యంగా 139 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ధావన్ సేన 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులకు పరిమితమైంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ (86 నాటౌట్; 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50; 37 బంతుల్లో 8 ఫోర్లు) లు అర్థశతకాలతో రాణించారు. శుభ్‌మన్ గిల్(3), ధావన్(4),రుతురాజ్(19), ఇషాన్ కిషన్(20) దారుణంగా విఫలం కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, రబడ రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రాంచీలో ఆదివారం రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది.