పంత్ మెరిసినా.. రెండో వ‌న్డేలో భార‌త్ ఓట‌మి

South Africa beat India by 7 wickets.ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను ఓ అద్భుత విజయంతో ఆరంభించిన భార‌త్‌.. ఆ త‌రువాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 2:36 AM GMT
పంత్ మెరిసినా.. రెండో వ‌న్డేలో భార‌త్ ఓట‌మి

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను ఓ అద్భుత విజయంతో ఆరంభించిన భార‌త్‌.. ఆ త‌రువాత ఒక్క‌టంటే ఒక్క మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించ‌లేదు. కీల‌క సంద‌ర్భాల్లో మ్యాచ్‌పై ప‌ట్టుబిగించ‌లేక ప్ర‌త్య‌ర్థికి విజ‌యాన్ని అప్ప‌గించేస్తుంది. నిర్ణయాత్మ‌క‌మైన రెండో వ‌న్డేలోనూ అదే పున‌రావృతమైంది. ఫ‌లితంగా ఓటమిని చ‌విచూసి.. వ‌న్డే సిరీస్‌ను కోల్పోయింది. పార్లే వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్.. రిష‌బ్‌పంత్‌(85; 71 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ (55; 79 బంతుల్లో 4పోర్లు), శార్ధూల్ ఠాకూర్‌(40 నాటౌట్; 38 బంతుల్లో 3పోర్లు, 1 సిక్స్‌)లు రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగులు చేసింది. స‌ఫారీ బౌల‌ర్లో షంసీ 2 వికెట్లు తీయ‌గా.. మ‌ల‌న్‌, మార్‌క్ర‌మ్‌, మ‌హారాజ్‌, ఫెలుక్వాయో త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 288 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే.. 48.1 ఓవర్లలో కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి విజ‌యాన్ని అందుకుంది. ఓపెన‌ర్లు క్వింట‌న్ డికాక్‌( 78; 66 బంతుల్లో 7పోర్లు, 3 సిక్స‌ర్లు), జానెమ‌న్ మ‌ల‌న్‌(91; 108 బంతుల్లో 8పోర్లు, 1సిక్స్‌)ల‌తో పాటు కెప్టెన్ బ‌వుమా(35; 36 బంతుల్లో 3పోర్లు), మార్‌క్ర‌మ్‌(37 నాటౌట్; 41 బంతుల్లో 4పోర్లు), వాండ‌ర్ డ‌సెన్‌(37 నాటౌట్; 38 బంతుల్లో 2పోర్లు) రాణించ‌డంతో ద‌క్షిణాఫ్రికా సునాయ‌సంగా ల‌క్ష్యాన్ని చేదించింది. భారత బౌలర్లలో బుమ్రా, చహల్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.

తొలి వన్డేలోనూ గెలిచిన సఫారీలు.. తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకున్నారు. ఇక ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 23న కేప్ టౌన్ లో జరగనుంది. సిరీస్ ఫలితం తేలడంతో మూడో వన్డే నామమాత్రంగా మారింది. క‌నీసం ఆఖ‌రి మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ కాకుండా టీమ్ఇండియా ప‌రువు కాపాడుకుంటుందో లేదో చూడాలి.

Next Story