దాదా కథ ఇక ముగిసినట్లే..!
Sourav Ganguly was offered IPL chairmanship.సౌరవ్ గంగూలీ..క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది
By తోట వంశీ కుమార్ Published on 12 Oct 2022 10:32 AM ISTసౌరవ్ గంగూలీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేశాడు. జట్టుకు దూకుడు మంత్రాన్ని నేర్పించాడు. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా గడిచిన మూడేళ్ల కాలంలో చక్రం తిప్పాడు. అయితే.. అన్ని వేళలా కాలం అనుకూలంగా ఉండదు. మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని ఆశపడిన గంగూలీ ఆ అవకాశం లేనట్లే. ఐపీఎల్ ఛైర్మన్ పదవిని సున్నితంగా తిరస్కరించిన దాదా.. ఐసీసీ పదవికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇక ఈ బెంగాల్ టైగర్ కథ ముగిసినట్లేనని క్రీడా వర్గాలు అభిప్రాయపడున్నాయి.
ఢిల్లీలో వారం రోజులుగా తీవ్రంగా సాగిన చర్చల్లో సౌరవ్ గంగూలీని సాగనంపేందుకే బోర్డు పెద్దలు నిర్ణయించుకున్నారు. దీంతో 1983 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడైన రోజర్ బిన్నీ బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఇక లాంఛనమే. ఈ నెల 18న ముంబైలో జరిగే ఏజీఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా రెండో సారి కార్యదర్శిగా కొనసాగేందుకు రంగం సిద్దమైంది.
ఆ పదవిని సున్నితంగా తిరస్కరించిన దాదా..
వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యేందుకు బోర్డు ఉన్నతాధికారుతో గంగూలీ మంతనాలు జరిపాడు. అయితే.. అధ్యక్ష పదవి రెండో దఫా ఇచ్చే సంప్రదాయం లేదని దాదాకు వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గంగూలీకి ఐపీఎల్ ఛైర్మన్ పదవికి ఇచ్చేందుకు ఆసక్తి చూపగా.. గంగూలీ సున్నితంగా తిరస్కరించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన తరువాత బోర్డులోని సబ్ కమిటీకి చీఫ్ అయ్యేందుకు నిరాకరించాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
బోర్డులోని అన్ని పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉండడంతో ఏజీఎంలో ఎన్నికలు జరగకపోవచ్చు. మంగళవారం బిన్నీ, జై షా, రాజీవ్ శుక్లా వివిధ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు, ప్రస్తుత కోశాధికారి అరుణ్‌సింగ్ ధుమాల్ ఐపీఎల్ పగ్గాలు చేపట్టనున్నాడు. బుధవారంతో నామినేషన్ల గడువు పూర్తి అవుతుంది. 14లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను 15న ప్రకటించనున్నారు.