కరోనా బారినపడ్డ భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ కోలుకున్నారు. కొవిడ్-19 నుంచి బయటపడటంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నాలుగు రోజుల క్రితం అలసటగా ఉండటంతో గంగూలీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన వెంటనే కోల్‌కతాలోని ఉడ్‌లాండ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. నాలుగు రోజులుగా ఆయనకు ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు ఇవాళ మరోసారి కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దాంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
గంగూలీ రాబోయే రెండు వారాల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటాడు. "మేము ఈ మధ్యాహ్నం గంగూలీని డిశ్చార్జ్ చేసాము. అతను డాక్టర్ల పరిశీలనలో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత తదుపరి చికిత్స గురించి నిర్ణయించబడుతుంది" అని ఆసుపత్రి అధికారి మీడియాకి తెలిపారు. డాక్టర్ సరోజ్ మోండోల్, డాక్టర్ సప్తర్షి బసు మరియు డాక్టర్ సౌతిక్ పాండాతో కూడిన మెడికల్ బోర్డు డాక్టర్ దేవి శెట్టి మరియు డాక్టర్ అఫ్తాబ్ ఖాన్‌తో సంప్రదించి గంగూలీ ఆరోగ్య స్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.