'సున్నా నుంచే స్టార్ట్ చేస్తా' : స్మృతి మంథాన

ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడి 80 పరుగులు చేసింది.

By -  Medi Samrat
Published on : 29 Dec 2025 9:20 PM IST

సున్నా నుంచే స్టార్ట్ చేస్తా : స్మృతి మంథాన

ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడి 80 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగులు కూడా పూర్తి చేసింది. స్మృతి ఈ ఘనత సాధించిన భారత్‌ నుంచి రెండో మహిళా బ్యాట్స్‌మెన్‌, ప్రపంచంలో నాలుగో బ్యాట్స్‌మెన్‌. అయితే.. ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత మంధాన తొలి స్పందన తాజాగా వెలుగులోకి వచ్చింది.

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మంధాన 48 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. షఫాలీ వర్మతో కలిసి ఆమె మొదటి వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది మహిళల T20 ఇంటర్నేషనల్‌లో భారత్‌ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం కావ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో షెఫాలీ 46 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 79 పరుగులు చేసింది.

మ్యాచ్ అనంతరం మంధాన మాట్లాడుతూ.. పది వేల పరుగులు చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లో సున్నా నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పింది. గత మ్యాచ్‌లో ఏం చేసినా రేపటి మ్యాచ్‌లో ఉపయోగపడటం క్రికెట్‌లో ఎప్పుడూ జరగదని పేర్కొంది.

బీసీసీఐ భారత క్రికెట్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మంధాన వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో మంధాన ఇలా అన్నారు. "మేము మునుపటి మ్యాచ్‌లలో చేసినది తదుపరి మ్యాచ్‌లో ఉపయోగపడటం ఎప్పుడూ జరగదు. క్రికెట్‌లో సున్నా నుండి ప్రారంభించాలి. స్కోర్‌బోర్డ్ ఎల్లప్పుడూ సున్నాతోనే ప్రారంభించాలి.. గత మ్యాచ్‌లో లేదా గత సిరీస్‌లో మీరు చేసిన పరుగులు ఉపయోగప‌డ‌వు. ఒక్కో ఫార్మాట్‌ను బట్టి తన అంచనాలు ఒక్కో విధంగా ఉంటాయని మంధాన చెప్పింది. మూడు ఫార్మాట్లలో నా అంచనాలు భిన్నంగా ఉన్నాయి. వేగంతో ఆడాల్సివున్నందున‌ టీ20 ఫార్మ‌ట్‌లో మన‌ల్ని మ‌నం ఎక్కువగా నిందించుకోలేమ‌ని పేర్కొంది.

Next Story