భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం పాలయ్యారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు ఆమెకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్ ఆస్పత్రిలో చేరాడు. వరుస మ్యూజిక్ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని అతడి సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.
పలాష్ ముచ్చల్ తల్లి అమిత పెళ్లి వాయిదా పడడం గురించి మాట్లాడాడు. స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టమని, స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువని చెప్పుకొచ్చారు. ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే స్మృతి కంటే ముందు పలాష్ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడన్నారు అమిత. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైందని వివరించారు.