రాచెల్ ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకున్న స్మృతి మంధాన

Smriti Mandhana Named ICC Womens Cricketer 2021. భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఐసీసీ విమెన్‌ క్రికెటర్ ఆఫ్ ది

By Medi Samrat  Published on  25 Jan 2022 9:49 AM IST
రాచెల్ ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకున్న స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఐసీసీ విమెన్‌ క్రికెటర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా నిలిచిన వారికి అంద‌జేసే రాచెల్ ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. ఇటీవలే ఐసీసీ-2021 అవార్డులను ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం.. 2021 సంవత్సరానికి ఐసీసీ టెస్ట్, వ‌న్డే, టీ20 జట్టులను ప్రకటించింది. వ్యక్తిగత అవార్డులను కూడా సోమవారం నాడు ప్రకటించారు. వీటిలో భారత ఓపెనర్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021గా ఎంపికైంది. నామినేష‌న్ష్‌లో టేమీ బీమౌంట్‌, లేజిలీ లీ, గాబీ లెవిస్ ల‌తో పోటీప‌డిన మంధాన చివ‌రికి పైచేయి సాధించింది.

స్మృతి మంధాన 2021లో అద్భుతంగా రాణించింది. ఈ ఏడాది 2 టెస్టుల్లో 61 సగటుతో 244 పరుగులు చేసి డే-నైట్ టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ ఏడాది 22 వన్డేల్లో 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 85కి పైగా ఉంది. ఈ ఏడాది ఆమె ఒక సెంచ‌రీ, ఐదు అర్ధ సెంచరీలు చేసింది. టీ20ల‌లో మంధాన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 31 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో సహా 255 పరుగులు చేసింది.

స్మృతి తన అంతర్జాతీయ కెరీర్‌లో 62 వన్డేల్లో 4 సెంచరీలు, 19 అర్ధ సెంచరీల సాయంతో 2377 పరుగులు చేసింది. 84 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆమె.. 82 ఇన్నింగ్స్‌ల్లో 1971 పరుగులు చేసింది. అందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్మృతి నాలుగు టెస్టుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేసింది. స్మృతి త‌న‌ కెరీర్‌లో రెండోసారి ఈ అవార్డును గెలుచుకుంది. 2018లో తొలిసారిగా ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. అదే సంవత్సరం.. ఆమె ఉత్తమ వన్డే క్రికెటర్‌గా ఎంపికైంది. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి.. సాంగ్లీ నివాసి. స్మృతి భారత మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు కాబోయే కెప్టెన్‌గా అభివ‌ర్ణిస్తుంటారు సీనియ‌ర్ క్రికెట‌ర్లు.


Next Story