ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన స్మృతి మంధాన..!
మంగళవారం విడుదల చేసిన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాట్స్‌మెన్‌లలో అగ్రస్థానానికి చేరుకుంది.
By - Medi Samrat |
మంగళవారం విడుదల చేసిన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాట్స్‌మెన్‌లలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మంధాన పటిష్ట ప్రదర్శన చేసింది. దీంతో ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఆమె సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మంధాన వరుసగా 58, 31 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడింది.
మంధాన ర్యాంకింగ్‌లో 790 పాయింట్లు సాధించి దక్షిణాఫ్రికా క్రీడాకారిణి లారే వోల్వార్డ్‌ను వెనక్కి నెట్టింది. వోల్‌వార్ట్ 782 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మార్చి, ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో వోల్వార్డ్ మంధానను వెనక్కినెట్టే అవకాశం ఉంది. తన చివరి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన అలిస్సా హీలీ 744 పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. బెత్ మూనీ మూడో స్థానంలో ఉండగా, ఆష్లే గార్డనర్ (724) ఐదో స్థానంలో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొమ్మిదో స్థానంతో టాప్ 10లో చేరగా, జెమీమా రోడ్రిగ్స్ 12వ స్థానంలో ఉంది.
బౌలింగ్ జాబితాలో ఎలీనా కింగ్ (775) అగ్రస్థానానికి చేరుకుంది. దాదాపు నాలుగేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆమె అధిగమించింది. గార్డనర్ మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా 16.71 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టి వన్డే సిరీస్‌లో టాప్ బౌలర్‌గా నిలిచింది. ఆమె మూడవ, చివరి ODIలో 33 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శన ఆస్ట్రేలియా 185 పరుగుల విజయాన్ని నమోదు చేయడంలో సహాయపడింది. ఎలెనా తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ పాయింట్లను కూడా సాధించింది. ఎలెనాతో పాటు మరో ముగ్గురు ఆస్ట్రేలియా బౌలర్లు గార్డనర్ (మూడో), అన్నాబెల్ సదర్లాండ్ (ఐదో), కిమ్ గార్త్ (ఎనిమిదో) కూడా మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్నారు.
వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో గార్డనర్ (516) అగ్రస్థానంలో కొనసాగుతుంది. వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్ (418)తో పోలిస్తే ఆమె 98 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. సదర్లాండ్ (534) 23 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకుంది. ఆల్ రౌండర్ జాబితాలో ఐదో స్థానంతో టాప్ 10లో కూడా దీప్తి నిలిచింది.