హ్యాట్రిక్‌ సెంచరీ చేసే అవ‌కాశం కోల్పోయినా.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జ‌రిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా.. ఆ జ‌ట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది

By Medi Samrat  Published on  24 Jun 2024 3:02 AM GMT
హ్యాట్రిక్‌ సెంచరీ చేసే అవ‌కాశం కోల్పోయినా.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జ‌రిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా.. ఆ జ‌ట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. స్మృతి మంధాన ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించింది. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే రెండు సెంచ‌రీలు చేయ‌గా.. తృటిలో మంధాన మూడో సెంచరీని కోల్పోయింది. మంధాన 108.43 స్ట్రైక్ రేట్‌తో 83 బంతుల్లో 90 పరుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది.

ఈ సిరీస్‌లో రాణించ‌డం ద్వారా స్మృతి చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మ‌హిళా బ్యాట్స్‌మెన్ గా ఆమె నిలిచింది. వన్డే సిరీస్‌లో మంధాన 342 పరుగులు చేసింది. సిరీస్‌లోని తొలి వన్డేలో స్మృతి 127 బంతుల్లో 117 పరుగులు.. రెండో వన్డేలో 120 బంతుల్లో 136 పరుగులు చేసింది.

వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మ‌హిళా బ్యాట్స్‌మెన్‌లు వీరే..

స్మృతి vs సౌతాఫ్రికా(2024) – 342 పరుగులు

జయ శర్మ vs న్యూజిలాండ్(2003)- 309 పరుగులు

మిథాలీ రాజ్ vs ఆస్ట్రేలియా(2004) – 289 పరుగులు

మిథాలీ రాజ్ vs ఇంగ్లండ్(2010)- 287 పరుగులు

పూనమ్ రౌత్ vs సౌతాఫ్రికా(2021)- 263 పరుగులు

మంధాన హ్యాట్రిక్‌ సెంచరీ చేసే అవ‌కాశం కోల్పోయినప్పటికీ.. మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా మంధాన నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన 85 వన్డేల్లో 85 ఇన్నింగ్స్‌ల్లో 45.37 సగటుతో 3,585 పరుగులు చేసింది. ఈ జాబితాలో మిథాలీ రాజ్‌ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ 232 మ్యాచ్‌లలో 211 ఇన్నింగ్స్‌లలో 50.68 సగటుతో 7,805 పరుగులు చేసింది.

Next Story