భారత్‌పై ఓటమి.. టీమ్ మెంబర్స్‌పై కెప్టెన్ రజా ఫైర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 11 July 2024 10:29 AM ISTజింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే జట్టు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.
జింబాబ్వే జట్టులో డియోన్ మైయర్స్(65) మాత్రమే రాణించాడు. అయితే అతని ఇన్నింగ్స్ కూడా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే.. ఓటమి తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చాలా కోపంగా కనిపించాడు. ఓటమికి ఆటగాళ్లను నిందించాడు.
జింబాబ్వే జట్టు కెప్టెన్ సికందర్ రజా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ.. ఇంతకుముందు మేము మా ఫీల్డింగ్ గురించి చాలా గర్వ పడేవాళ్లం. కానీ ఇప్పుడు ఫీల్డింగే మమ్మల్ని ముంచుతోందని ఆటగాళ్ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు 20 పరుగులు అదనంగా ఇచ్చాం. అయినప్పటికీ.. మా టాప్ ఆర్డర్‌తో మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి. మేము గత 15 సంవత్సరాలలో 15 ఓపెనింగ్ జోడీలు ప్రయత్నించాము. మేము ఆటగాళ్లకు మద్దతునివ్వాలి. అది పరిష్కరించబడిన తర్వాతే విషయాలు మాకు అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో చాలా క్రికెట్ ఆడుతున్నారు.. ఇప్పుడు మనమందరం బాధ్యత వహించాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లు చేసే కొన్ని తప్పులను నేను అంగీకరించగలను.. అయితే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ముందుకు రావాలని అన్నాడు.