ఆరు వికెట్లు తీసిన సిరాజ్.. సరికొత్త రికార్డ్
ఆసియా కప్ ఫైనల్ లో భారత బౌలర్లు విజృంభించారు. మ్యాచ్ తొలి ఓవర్‌లోనే బుమ్రా వికెట్ తీయగా..
By Medi Samrat Published on 17 Sept 2023 4:48 PM ISTఆసియా కప్ ఫైనల్ లో భారత బౌలర్లు విజృంభించారు. మ్యాచ్ తొలి ఓవర్‌లోనే బుమ్రా వికెట్ తీయగా.. 4వ ఓవర్‌లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక మొదటి 4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే లంక వికెట్ కోల్పోయింది. మూడో బంతికి ఓపెనర్ కుశాల్ పెరీరా(0).. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 4వ ఓవర్‌లో సిరాజ్ నలుగురిని పెవిలియన్ చేర్చాడు. మొదటి బంతికి పాథుమ్ నిశాంక (2) క్యాచ్ ఔట్ అవ్వగా.. మూడో బంతికి సమరవిక్రమ (0) ఎల్బిడబ్ల్యూ, నాలుగో బంతికి చరిత్ అసలంక (0) క్యాచ్ ఔట్, ఆఖరి బంతికి ధనంజయ డిసిల్వా (4) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగారు.ఇక ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్.. నాలుగో బంతికి ప్రత్యర్థి కెప్టెన్ శనకను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో తాను వేసిన 16 బంతులకే 5 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ కెరీర్ లో మొదటి సారి 5 వికెట్లను తీసుకున్నాడు. ఇక 11.2 వద్ద కుశాల్ మెండిస్ ను క్లీన్ బౌల్డ్ చేసి ఆరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక జట్టు ఒక మార్పుతో ఈ మ్యాచులోకి బరిలోకి దిగింది. మహీశ్ తీక్షణ స్థానంలో దుశన్ హేమంత జట్టులోకి వచ్చాడు. గత మ్యాచులో రెస్ట్ తీసుకున్న టీమిండియా క్రికెటర్లు మొత్తం జట్టులోకి వచ్చేశారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌లు తుది జట్టులో భాగమయ్యారు.