రక్త పరీక్ష తర్వాత గిల్‌కు షాకిచ్చిన ఫిజియో.. ఆ టోర్నీలో ఆడ‌వ‌ద్ద‌ని సూచ‌న‌..!

ఆసియా కప్ 2025కి ముందు ప్రతిష్టాత్మక దేశీయ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

By Medi Samrat
Published on : 23 Aug 2025 6:50 AM IST

రక్త పరీక్ష తర్వాత గిల్‌కు షాకిచ్చిన ఫిజియో.. ఆ టోర్నీలో ఆడ‌వ‌ద్ద‌ని సూచ‌న‌..!

ఆసియా కప్ 2025కి ముందు ప్రతిష్టాత్మక దేశీయ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ పోటీలో భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు నార్త్ జోన్ ప‌గ్గాలు అప్ప‌గించారు. అయితే ఇప్పుడు గిల్‌ ఈ టోర్నీలో పాల్గొనడం లేదనే వార్తలు వస్తున్నాయి.

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత నార్త్ జోన్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇటీవల రక్త పరీక్ష తర్వాత ఫిజియో తన నివేదికను BCCIకి పంపాడు. దులీప్ ట్రోఫీలో పాల్గొనవద్దని గిల్‌కు సలహా ఇచ్చాడు. ప్రస్తుతం గిల్ విహారయాత్రలో ఉన్నాడు. ఇంటర్నెట్ మీడియాలో తన పోటోలను కూడా షేర్ చేశాడు. అందులో అతను పడవలో కనిపించాడు.

దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. గిల్ నేతృత్వంలోని నార్త్ జోన్ జట్టు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో ఈస్ట్ జోన్‌తో తలపడనుంది. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గిల్ ఆడకపోతే, వైస్ కెప్టెన్ అంకిత్ కుర్ జట్టుకు నాయకత్వం వహించవచ్చు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

సెప్టెంబరు 9 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025పై భారత్ ఇప్పుడు దృష్టి సారించింది. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 4 లేదా 5 న భారత జట్టు దుబాయ్ బయలుదేరుతుంది. అటువంటి పరిస్థితిలో, దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టు ముందుకు సాగినా, గిల్ అందుబాటులో ఉండడు. ఆసియా కప్‌లో వైస్ కెప్టెన్‌గా గిల్‌కు బాధ్యతలు అప్పగించారు.

Next Story