యువరాజ్ సింగ్ కాదు.. గిల్‌కు స్ఫూర్తినిచ్చింది ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లట..!
ప్రస్తుతం భారత క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ పేరు చర్చనీయాంశమైంది.
By - Medi Samrat |
ప్రస్తుతం భారత క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ పేరు చర్చనీయాంశమైంది. రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత అతడు టీమిండియా కెప్టెన్ అయ్యాడు. ఇటీవల, అతడు ఆసియా కప్‌లో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్సీని కూడా అందుకున్నాడు. అతడు ఇప్పటికే భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.
గిల్ ఇద్దరు గొప్ప క్రికెటర్లను చూస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక పోడ్‌కాస్ట్‌లో గిల్ ఈ ఆటగాళ్లను తన ఐకాన్‌లుగా భావిస్తానని చెప్పాడు. తాను గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ని చూస్తూ పెరిగానని, ఆయన తన ఆరాధ్యదైవం అని గిల్ చెప్పాడు. సచిన్ కాకుండా మరో దిగ్గజం విరాట్ కోహ్లీని కూడా తన పేవరేట్ క్రికెటర్‌గా పేర్కొన్నాడు.
ఆపిల్ మ్యూజిక్ పోడ్‌కాస్ట్‌లో గిల్ మాట్లాడుతూ.. నాకు ఇద్దరు పేవరేట్ క్రికెటర్లు ఉన్నారు. ఒకరు సచిన్ టెండూల్కర్. మా నాన్నగారికి ఆయనంటే అభిమానం, ఆయన వల్లే నేను క్రికెట్‌లోకి అడుగుపెట్టాను. ఆయన 2013లో రిటైరయ్యారు. ఆ తర్వాత నేను క్రికెట్‌ను అర్థం చేసుకునే సమయంలో.. నైపుణ్యాల పరంగానే కాకుండా మానసికంగా, వ్యూహాత్మకంగా, నేను విరాట్ కోహ్లీని ఫాలో అవడం ప్రారంభించాను. కోహ్లీ పని చేసే విధానం నాకు నచ్చింది, ఆటపై అతనికి ఉన్న మక్కువ.. ఆకలితో ఆయన మైదానంలో ఉండే తీరు.. మనం నైపుణ్యాలను నేర్చుకోవచ్చు, మెళుకువలను నేర్చుకోవచ్చు, కానీ ఆకలి అనేది మన వద్ద ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ విరాట్ ఆకలిని కలిగి ఉన్నాడు.. అది నాకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు.
అయితే.. గిల్‌ను మెరుగుపరచడంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. గిల్ ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు. యువరాజ్ తన ఆటను మెరుగుపరుచుకోమని గిల్‌కు సలహా ఇవ్వడం కూడా చాలాసార్లు కనిపించింది. అయితే గిల్ ఈ సందర్భంలో యువరాజ్ పేరు చెప్పకపోవడం విశేషం.
రానున్న రోజుల్లో గిల్ భుజాలపై మరింత బాధ్యత పెరగనుంది. భారత జట్టులో రోహిత్, కోహ్లీ లేరు. గిల్ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా మారాడు. ఇంగ్లండ్ టూర్‌లో అతను ప్రదర్శించిన ప్రదర్శన అంచనాలను మరింత పెంచింది. అతడికి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో గిల్‌పై బాధ్యతల భారం పడనుందని, దాన్ని ఎలా నిర్వహిస్తాడోనని ఊహాగానాలు వెలువడ్డాయి.