శ‌త‌కం చేద్దామ‌నుకున్నా.. అయితే అది నా చేతుల్లో లేదు

Shubman Gill disappointed at missing out on century in 3rd ODI against WI.వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో టీమ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2022 9:46 AM GMT
శ‌త‌కం చేద్దామ‌నుకున్నా.. అయితే అది నా చేతుల్లో లేదు

వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్‌ గిల్‌(98 నాటౌట్; 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌) త్రుటిలో శ‌త‌కం చేజార్చుకున్నాడు. దీనిపై మ్యాచ్ అనంత‌రం గిల్ మాట్లాడుతూ తాను ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించాల‌నుకున్న‌ట్లు చెప్పాడు. అయితే.. వ‌ర్షం అనేది త‌న చేతుల్లో లేనందుకు ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని, దీంతో త‌న తొలి అంత‌ర్జాతీయ శ‌త‌కం కోల్పోయిన‌ట్లు తెలిపాడు.

"తొలి రెండు వ‌న్డేల్లో ఎంతో మెరుగ్గా బ్యాటింగ్ చేశా. అయితే.. ఆ మ్యాచుల్లో నేను ఔటైన విధానం తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేయాల‌నుకున్నా. ఇంకొక్క ఓవ‌ర్ మిగిలి ఉన్నా స‌రిపోయేది. అయిన‌ప్ప‌టికి నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతోషంగా ఉంది. జ‌ట్టు విజ‌యం సాధించ‌డంతో ఎంతో ఆనందంగా ఉంది "అని గిల్ చెప్పాడు.

ఇక ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌కు రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపేసి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన వెస్టిండీస్ ముందు 257 పరుగుల లక్ష్యాన్ని విధించారు. దాంతో గిల్ అరంగేట్ర సెంచరీ అందుకోలేకపోయాడు.

గిల్‌ ఇన్నింగ్స్‌పై అభిమానులు స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు. గాశారం బాలేకపోతే ఇలానే ఉంటుందని, గిల్ నెత్తిన శని తాండవం చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. గిల్ కూడా అతి జాగ్రత్తకు పోయి సెంచరీ చేజార్చుకున్నాడని అంటున్నారు. 88 బంతుల్లో 88 పరుగులు చేసిన గిల్.. ఆ త‌రువాత సెంచ‌రీ కోసం ఆచితూచి ఆడాడు. 10 బంతులకు 10 సింగిల్స్ మాత్రమే తీసాడు. ఇందులో ఒక్క బౌండరీ బాదినా సెంచరీ పూర్తి చేసుకునేవాడని, చేజేతులా బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు.


Next Story