ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజమ్ ప‌స్ట్ ప్లేస్‌కు చేరువైన టీమిండియా యువ క్రికెట‌ర్‌

ఐసీసీ బుధవారం పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

By Medi Samrat  Published on  13 Sept 2023 5:58 PM IST
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజమ్ ప‌స్ట్ ప్లేస్‌కు చేరువైన టీమిండియా యువ క్రికెట‌ర్‌

ఐసీసీ బుధవారం పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టాప్‌-2 స్థానానికి శుభ్‌మన్‌ గిల్‌ చేరడంతో అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ ఆజమ్ ప్రమాదంలో పడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా టాప్-10లో నిలిచాడు.

ఆసియా కప్ 2023లో రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన శుభ్‌మన్ గిల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ను సాధించాడు. బుధ‌వారం విడుద‌ల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్ 759 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్‌ ఆజమ్ 863 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ రాస్సీ వాన్ డెర్ డుసెన్ 745 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆసియ క‌ప్ టోర్నీలో రాణించిన‌ భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ పై సెంచరీ చేసిన కింగ్ కోహ్లి ఒక్క స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం కోహ్లి 8వ స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

బౌలింగ్ విషయానికొస్తే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు. మిచెల్ స్టార్క్ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన ట్రెంట్ బౌల్ట్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆడమ్ జంపా ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇద్దరు భారత బౌలర్లు టాప్-10లో చోటు దక్కించుకోగలిగారు. ఆసియా క‌ప్‌లో రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. తాజా ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచాడు. మహ్మద్ సిరాజ్ 9వ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది 10వ స్థానంలో ఉన్నాడు.

Next Story