టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొంది. సూపర్-12 దశ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పైనా ఓటమిపాలైంది. టీమిండియాలో పరిస్థితులు ఏమీ బాగా లేవని, జట్టు రెండుగా విడిపోయిందని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ తెలిపారు. ఒకటి కోహ్లీ గ్రూపు కాగా, మరొకటి కోహ్లీ వ్యతిరేక గ్రూపు అని చెప్పుకొచ్చారు. తొలి రెండు మ్యాచ్ లలో కోహ్లీ కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నాడని అఖ్తర్ విమర్శించాడు.
కోహ్లీ గొప్ప క్రికెట్ ఆటగాడని, ఆ విషయాన్ని అందరూ గౌరవించాలని సూచించాడు. టీమిండియా రెండు గ్రూపులుగా ఎందుకు విడిపోయిందో నాకు తెలియదని అన్నాడు. బహుశా కోహ్లీ కెప్టెన్ గా ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించిన తర్వాత ఏర్పడిన పరిణామాల వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అఖ్తర్ వివరించాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టాస్ ఓడిపోగానే టీమిండియా ఆటగాళ్లు డీలాపడ్డారని వివరించాడు. అక్కడినుంచే వారి ఓటమి ప్రారంభమైందని అన్నాడు. మ్యాచ్ సందర్భంగా వారి దృక్పథమే బాగాలేదని అఖ్తర్ తెలిపాడు.
లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ మ్యాచ్ లో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను వన్‌డౌన్‌లో దించి మేనేజ్‌మెంట్ పొరపాటు చేసిందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకుని బౌల్ట్‌ను ఎదుర్కోలేవనే సంకేతాలు రోహిత్ శర్మకు ఇచ్చినట్లయిందని ఆయన అన్నారు. రోహిత్ శర్మ ఆటతీరుపై అతడికే అనుమానాలు కలిగాయని అభిప్రాయపడ్డారు. ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్ స్థానంలో కాకుండా 4 లేక 5వ స్థానంలో దించితే బాగుండేదని తెలిపారు.