తెలివిలేని మేనేజ్‌మెంట్.. ఆటగాళ్లు కూడా అజ్ఞానులు.. పీసీబీ, క్రికెటర్లపై అక్తర్ మండిపాటు
భారత్‌పై ఓటమితో పాక్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు నిరాశ చెందారు.
By Medi Samrat Published on 24 Feb 2025 6:51 PM IST
భారత్‌పై ఓటమితో పాక్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు నిరాశ చెందారు. మాజీ క్రికెటర్లు ఆగ్రహంతో ఉన్నారు. మహ్మద్ రిజ్వాన్ విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. జట్టుకు ఏం చేయాలో తెలియడం లేదని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఎవరికీ ఏమీ తెలియదు. స్పష్టమైన దిశానిర్దేశం లేకుండానే జట్టు టోర్నీలోకి ప్రవేశించింది. అక్తర్ చేసిన ఈ ప్రకటన పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది, దీని కారణంగా సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు దాదాపుగా ముగిశాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. దుబాయ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో అక్తర్ మాట్లాడుతూ.. "భారత్‌తో ఓటమి తర్వాత నేను ఏమాత్రం నిరాశ చెందలేదు, ఎందుకంటే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. మీరు ఐదుగురు బౌలర్లను ఎంచుకోలేరు. ప్రపంచం మొత్తం ఆరుగురు బౌలర్లతో ఆడుతోంది, మీరు ఇద్దరు ఆల్ రౌండర్లతో వెళతారు. తెలివిలేని, మూర్ఖమైన టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రమే ఇలా చేస్తుంది. పెద్ద టోర్నీలో ఆడేందుకు అవసరమైన సామర్థ్యం, అవగాహన లేని జట్టును ఎంపిక చేశారని అక్తర్ ఆరోపించాడు. "నేను నిజంగా నిరాశకు గురయ్యాను.. మేము ఆటగాళ్లను నిందించలేము.. ఎందుకంటే ఆటగాళ్లు కూడా జట్టు మేనేజ్‌మెంట్ వలె అజ్ఞానులు. వారికి ఏం చేయాలో తెలియడం లేదని మండిపడ్డాడు.
పాకిస్థాన్ ఆటగాళ్ల ఉద్దేశాలు, సామర్థ్యంపై కూడా అక్తర్ ప్రశ్నలు సంధించాడు. ఉద్దేశం వేరే విషయం, రోహిత్, విరాట్, శుభ్‌మన్ లాంటి నైపుణ్యాలు వాళ్లకు లేవు’ అని అన్నాడు. ఆటగాళ్లకు గానీ, మేనేజ్‌మెంట్‌కు గానీ ఏమీ తెలియదు. స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా వారు ఆడటానికి వెళ్లారు. వారు ఏమి చేయాలో ఎవరికీ తెలియదు అని విమర్శించాడు.
కోహ్లీ సెంచరీపై అక్తర్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ తన వన్డే కెరీర్‌లో 51వ సెంచరీని, అంతర్జాతీయ క్రికెట్‌లో 82వ సెంచరీని నమోదు చేశాడు. భారత స్టార్‌ను అభినందిస్తూ అక్తర్ ఇలా అన్నాడు. 'పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలని విరాట్‌కు చెప్తె.. అతను సిద్ధంగా వచ్చి సెంచరీ సాధిస్తాడు. అతడికి సెల్యూట్.. అతను సూపర్ స్టార్.. ప్రస్తుత కాలంలో గొప్ప ఆటగాడు. అతను 100 సెంచరీలు సాధిస్తాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నాడు.