Video : 10 బంతులే ఆడాడు.. కానీ, ఎంత‌టి విధ్వంసం సృష్టించాడంటే..?

షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతుల్లో 39 పరుగులతో విధ్వంస‌క‌ర‌ ఇన్నింగ్స్ ఆడాడు.

By Medi Samrat
Published on : 17 July 2025 8:30 PM IST

Video : 10 బంతులే ఆడాడు.. కానీ, ఎంత‌టి విధ్వంసం సృష్టించాడంటే..?

షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతుల్లో 39 పరుగులతో విధ్వంస‌క‌ర‌ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. హెట్మెయర్ ఇన్నింగ్స్ సహాయంతో గ్లోబల్ సూపర్ లీగ్ 2025 సెమీ-ఫైనల్స్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 4 వికెట్ల తేడాతో హోబర్ట్ హరికేన్స్‌ను ఓడించి ఫైన‌ల్‌కు చేరింది. జూలై 18న గయానా అమెజాన్ వారియర్స్, రంగ్‌పూర్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ సమయానికి వారియర్స్ స్కోరు 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హెట్మెయర్ క్రీజులోకి వచ్చాడు. జట్టు 63 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది. హెట్మెయర్ తొలుత‌ డాట్ బాల్ ఆడాడు. ఆ తర్వాత సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే హెట్‌మెయర్ తన దూకుడును ప్రదర్శించాడు. అలెన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హెట్మెయర్ సిక్సర్లు బాదాడు. వ‌రుస నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాదాడు. ఐదో బంతికి రెండు పరుగులు చేశాడు. ఆ తర్వాత డీప్ మిడ్ వికెట్ వైపు సిక్సర్ కొట్టి ఓవర్ ముగించాడు. దీంతో ఈ ఓవర్‌లో 32 పరుగులు వచ్చాయి.

ఆ తర్వాత ఓవ‌ర్‌లో మీర్ వేసిన బంతికి హెట్మెయర్ సిక్సర్ బాదాడు. తర్వాతి ఓవర్‌లో హెట్మెయర్ ఇన్నింగ్స్ ముగిసింది. హెట్మెయర్ యొక్క తుఫాను ఇన్నింగ్స్ మ్యాచ్ గతిని మార్చింది. ఈ క్ర‌మంలోనే మొయిన్ అలీ నేతృత్వంలోని గయానా అమెజాన్ వారియర్స్ విజయం సాధించింది.

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ముందు హెట్మెయర్ రెచ్చిపోయాడు. జూలై 20 నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ప్రారంభం కానుంది.

Next Story