'ఆ రోజు నా బ్యాడ్ డే'.. వేలంలో ఆమ్ముడుపోకపోవడంపై మౌనం వీడిన ఆల్ రౌండర్
IPL 2025 మెగా వేలంలో ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఏ ప్రాంఛైజీ కొనలేదు.
By Medi Samrat
IPL 2025 మెగా వేలంలో ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఏ ప్రాంఛైజీ కొనలేదు. అయినా ఈ సీజన్‌లో ఆడుతున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని జట్టులో చేర్చుకుంది. 'లార్డ్'గా ప్రసిద్ధి చెందిన శార్దూల్ ఠాకూర్ IPL 2025లో తన ఆట ద్వారా తానేంటో మరోమారు నిరూపించుకున్నాడు. అతడు కేవలం రెండు మ్యాచ్‌లలో మొత్తం ఆరు వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి తన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.
33 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0), అభినవ్ మనోహర్ (2), మహ్మద్ షమీ (1)ల వికెట్లను ఠాకూర్ తీశాడు. ఈ అద్భుత ప్రదర్శనకు అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
శార్దూల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్, నికోలస్ పూరన్ (70), మిచెల్ మార్ష్ (52) అద్భుతమైన ఇన్నింగ్స్‌ల సహాయంతో లక్నో సూపర్‌జెయింట్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 23 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్ విజయాల ఖాతా తెరిచింది.
ఇన్నింగ్స్ విరామం సమయంలో శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని విషయమై బ్రాడ్‌కాస్టర్‌తో బహిరంగంగా మాట్లాడాడు. ఇదంతా క్రికెట్‌లో జరుగుతుందని నేను నమ్ముతాను. వేలం రోజు కొనుగోలుదారు దొరకకపోవడం నాకు బ్యాడ్ డే. వారి బౌలర్లకు గాయాల కారణంగా LSG నన్ను సంప్రదించింది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే టాక్ ఎప్పుడూ ఉండేది. ఆ తర్వాత జహీర్ ఖాన్ ఉన్నాడు. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు చూస్తాం. నాకు గెలుపు ముఖ్యం. నేను వికెట్లు, పరుగుల పట్టికలు చూడను. నేను ప్రభావం చూపగల, మ్యాచ్-విజేత ప్రదర్శనలను నమ్ముతాను. బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ బౌలర్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై బౌలర్లు ఎందుకు ఆధిపత్యం చెలాయించకూడదు.? హైదరాబాద్‌పై మా ప్లాన్ ఇదే. వాళ్లు ఫ్లాట్ పిచ్‌లపై చాలా పరుగులు చేస్తున్నారు. వారిని అడ్డుకోగలిగాం అని పేర్కొన్నాడు.
లక్నో సూపర్‌జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేయడం ద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని ఆక్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానానికి పడిపోయింది.