ఆస్ట్రేలియా క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం షేన్ వార్న్ వయసు 52 సంవత్సరాలు. షేన్ వార్న్ థాయిలాండ్‌లోని కో స్యామ్యూయ్‌లో అతని విల్లాలో గుండెపోటుకు గురై విగత జీవిగా పడిఉన్నాడు. ఈ విషయమై "షేన్ అతని విల్లాలో స్పందన లేకుండా ఉన్నాడు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ.. అతని శరీరం వైద్యానికి స్పందించలేదని వార్న్ మేనేజ్‌మెంట్.. ఆస్ట్రేలియన్ మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వార్న్ కుటుంబం ఈ సమయంలో గోప్యతను అభ్యర్థిస్తుందని.. తదుపరి వివరాలను తగిన సమయంలో తెలియజేస్తుందని ప్రకటనలో తెలిపారు.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డులలోకి ఎక్కాడు వార్న్. షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడి 708 వికెట్లు సాధించాడు. అతను 1999 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. షేన్ వార్న్ అన్ని ఫార్మట్‌లలో కలిపి 1001 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. దశాబ్దకాలం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా జట్టులో వార్న్ ఒక భాగం. అత్యధిక టెస్టు వికెట్లు తీసిన జాబితాలో లెజెండరీ లెగ్ స్పిన్నర్ వార్న్ శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. వార్న్ మృతిని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ధృవీకరించకపోవడం గమనార్హం.