ఫిట్‌నెస్ సాధించిన షమీ.. ఆస్ట్రేలియా టూర్‌కు పంపిస్తారా.?
భారత పేసర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు.
By Medi Samrat Published on 12 Nov 2024 9:15 PM ISTభారత పేసర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత చీలమండ గాయం కారణంగా దూరంగా ఉన్న షమీ, బెంగాల్ vs మధ్యప్రదేశ్‌లో జరిగే రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయబోతున్నాడు. ODI ప్రపంచ కప్‌లో టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన షమీ చీలమండ శస్త్రచికిత్స కారణంగా విరామం తీసుకోవలసి వచ్చింది. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు షమీ తిరిగి వస్తాడని భావించారు, అయితే అతని పునరావాస ప్రక్రియలో భాగంగా రెస్ట్ ఇచ్చారు.
ప్రస్తుతం బెంగాల్ 4 గేమ్‌లలో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కర్ణాటకతో జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగాల్ 3 కీలక పాయింట్లు సాధించింది. నవంబర్ 13 బుధవారం నుంచి జరిగే మ్యాచ్ లో మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. షమీ అక్టోబర్‌లో తన గాయం గురించి మాట్లాడాడు. తనకు ప్రస్తుతం ఎలాంటి నొప్పి లేదని, బౌలింగ్ లో పూర్తి ఫిట్నెస్ తిరిగి సాధించాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి సిద్ధంగా ఉంటానా లేదా అనే విషయంపై తాను చాలా కాలంగా ఆలోచిస్తున్నానని, దానికి ఇంకా కొంత సమయం ఉందని చెప్పాడు. నవంబర్ 22న భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్ కు ఇప్పటికే పూర్తీ బృందాన్ని బీసీసీఐ ప్రకటించింది. రాబోయే రోజుల్లో షమీని ఆస్ట్రేలియా టూర్ కు పంపిస్తారా లేదా అన్నది రంజీల్లో షమీ ఇచ్చే ప్రదర్శనను బట్టి ఉంటుంది.