ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు మరో షాక్
Shami suffers wrist fracture. తొలి టెస్టులో ఓటమిని మరిచిపోకముందే టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది.
By Medi Samrat Published on 20 Dec 2020 10:10 AM GMTతొలి టెస్టులో ఓటమిని మరిచిపోకముందే టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. పితృత్వ సెలవులతో ఇప్పటికే మిగతా టెస్టులకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా భారత ప్రధాన పేసర్ మహ్మద్ షమి కూడా సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ విసిరిన బంతి షమీ భుజానికి తగిలింది. దీంతో అతడు భరించలేని నొప్పితో విలవిల లాడాడు. ఫిజియో వచ్చి నొప్పి నివారణ స్పే చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తదుపరి బాల్ ను కూడా ఎదుర్కోలేకపోయాడు. ఆపై వైద్యులు పరీక్షించగా.. అతని మణికట్టు ఎముక విరిగిందని తేలింది. కనీసం చేతిని పైకి ఎత్తే పరిస్థితుల్లో కూడా లేడని తెలుస్తోంది. నిజంగా షమీ దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. షమికి సంబంధించిన గాయం పై ఇంకా ఎలాంటి సమాచారం లేదన్నాడు. అతడు నొప్పిని భరించలేకపోతున్నాడని తెలిపారు. కనీసం భుజాన్ని కదల్చలేకపోతున్నాడు. గాయం తీవ్రత తెలిసేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని పేర్కొన్నాడు. షమీ అందుబాటులో లేకపోవడంతో.. నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కవచ్చు.