షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతా : గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనకు అవ‌కాశం ఉండి ఉంటే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పర్యటన కోసం మహ్మద్ షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతానని చెప్పాడు.

By Kalasani Durgapraveen  Published on  17 Nov 2024 6:45 PM IST
షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతా : గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనకు అవ‌కాశం ఉండి ఉంటే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పర్యటన కోసం మహ్మద్ షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతానని చెప్పాడు. గాయానికి శస్త్రచికిత్స తర్వాత 360 రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ ఇటీవలే మైదానంలోకి వచ్చాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన బెంగాల్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షమీ బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. షమీ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టి.. 36 బంతుల్లో కీలకమైన 37 పరుగులు చేశాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం త్వరలో ష‌మీని ఆస్ట్రేలియాకు పంపే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువ‌డ్డాయి.

రెండో టెస్టు కోసం ష‌మీ ఆస్ట్రేలియా వెళ్లవచ్చని అతని చిన్ననాటి కోచ్ పేర్కొన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో షమీ ఆడాల్సిన అవసరం లేదని.. పెర్త్ టెస్టు సమయానికి చేరుకోకపోయినా.. తదుపరి విమానంలో అయినా ష‌మీ ఆస్ట్రేలియా వెళ్లాలని గంగూలీ అన్నాడు. గంగూలీ మాట్లాడుతూ.. అవును.. నేను ష‌మీని ఆస్ట్రేలియాకు పంపుతాను. అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాల్సిన అవసరం లేదు. పెర్త్ టెస్టుకు దూరమైనా.. అతడిని ఆస్ట్రేలియాకు పంపిస్తాను. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు.. అతను ఫ్లైట్‌లో ఉండాలి.. అతను ఆస్ట్రేలియా వెళ్లే తదుపరి విమానంలో ఉండాలని అన్నాడు. అతను (షమీ) పెర్త్ టెస్టులో ఆడలేకపోవచ్చు, కానీ బౌలింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అత‌ని ఎత్తు, పరిస్థితుల కారణంగా ఆకాష్ దీప్ కంటే ప్రసిద్ధ్‌కే ప్రాధాన్యత ఇస్తారని నేను భావిస్తున్నాను. అందువల్ల షమీ విమానంలో బ‌య‌లుదేరి అడిలైడ్ టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఆస్ట్రేలియాలో షమీకి మంచి రికార్డు ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీశాడు. షమీ సగటు 32.16 అని వ్యాఖ్యానించాడు.

Next Story