ఫేస్‌బుక్ లైవ్‌లో చంపేస్తానని షకీబ్ కి బెదిరింపు..!

Shakib Al Hasan gets death threat. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్ అల్ హసన్‌ను చంపేస్తాన‌ని ఓ యువ‌కుడు ఫేస్‌బుక్

By Medi Samrat  Published on  17 Nov 2020 1:50 PM GMT
ఫేస్‌బుక్ లైవ్‌లో చంపేస్తానని షకీబ్ కి బెదిరింపు..!

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ షకీబ్ అల్ హసన్‌ను చంపేస్తాన‌ని ఓ యువ‌కుడు ఫేస్‌బుక్ లైవ్‌లో వార్నింగ్ ఇచ్చాడు. కత్తి పట్టుకోని మరీ షకీబ్‌‌ను హెచ్చరించాడు. ఢాకాకు వెళ్లి మరీ షకీబ్‌ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ యువ‌కుడు అంత‌లా రెచ్చిపోవ‌డానికి కార‌ణం ష‌కీబ్.. కాళిమాత పూజ‌లో పాల్గొన‌డ‌మేన‌ట‌.

గ‌త గురువారం కోల్‌కతాకు వచ్చిన షకీబ్.. ఓ కాళీమాత పూజ కార్యక్రమంలో పాల్గొన్నాడని, విగ్రహం ముందు ప్రార్థనలు కూడా చేశాడని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో స‌ద‌రు యువ‌కుడు లైవ్‌లో ష‌కీబ్‌కు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. దీనిపై ష‌కీబ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు స‌ద‌రు యువ‌కుడిని గుర్తించే ప‌నిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం బంగ్లాకు చేరుకున్న షకీబ్ త‌న‌పై జ‌రుగుత‌న్న అస‌త్య ప్ర‌చారాల‌ను ఖండిచాడు. ఓ వీడియో ద్వారా జ‌రిగింది ఏంటో తెలియ‌జేశాడు. అసలు తాను ఎలాంటి పూజలు నిర్వహించలేదని తెలిపాడు. తాను హాజరైన ఇతర ప్రోగ్రామ్‌లో కూడా మత సంబంధమైన కార్యక్రమాలు లేవన్నాడు. అయితే పూజ కార్యక్రమానికి హాజరైన తనను దీపాలు వెలిగించమని నిర్వాహకులు కోరితే సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు.

ఇక ఓ అభిమాని ఫోన్ పగలగొట్టాననే ప్రచారంలో కూడా వాస్తవం లేదని స్పష్టం చేశాడు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ప్రమాదవశాత్తు పగిలిపోయిందని, దానికి తాను క్షమాపణలు కూడా చెప్పానన్నాడు. ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ గ‌తేడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనని ఓ బుకీ సంప్రదించగా.. ఆ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వకుండా షకీబ్ దాచాడు. దీంతో అతనిపై తొలుత రెండేళ్ల నిషేధం విధించ‌గా.. త‌న త‌ప్పును ఒప్పుకోవ‌డంతో ఆ నిషేదాన్ని ఏడాదికి కుదించారు. అక్టోబరు 29తో అత‌నిపై ఉన్న నిషేదం ముగిసింది.


Next Story