షకీబ్ అల్ హసన్‌‌పై నిషేధం.. ఎప్పటి వరకూ అంటే..

Shakib Al Hasan banned for 4 games of Dhaka Premier League. షకీబ్ అల్ హసన్.. ఢాకా ప్రీమియర్ లీగ్ లో చేసిన రచ్చ గురించి

By Medi Samrat  Published on  12 Jun 2021 3:25 PM GMT
షకీబ్ అల్ హసన్‌‌పై నిషేధం.. ఎప్పటి వరకూ అంటే..

షకీబ్ అల్ హసన్.. ఢాకా ప్రీమియర్ లీగ్ లో చేసిన రచ్చ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్‌లో మహ్మదాన్ స్పోర్టింగ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అబహాని లిమిటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్‌పై కొట్టడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. స్టంప్‌లను కాలితో తన్నిన షకీబ్ అల్ హసన్.. ఆ తర్వాత ఓవర్‌లో వికెట్లని మొత్తం పీకేసి విసిరి కొట్టాడు.

అతడు చేసిన తప్పుకు ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తోంది. ప్రముఖ బంగ్లాదేశ్ క్రికెట్ పోర్టల్ 'బిడిక్రిక్ టైమ్' ప్రకారం, ఢాకా ప్రీమియర్ లీగ్ లో అహంకార ప్రవర్తన కారణంగా మహ్మదాన్ స్పోర్టింగ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ నాలుగు మ్యాచ్ ల వరకూ నిషేధించబడ్డాడు. షకీబ్ ఢాకా ప్రీమియర్ లీగ్ లో అతడి జట్టు ఆడబోయే తర్వాతి మ్యాచ్ లలో ఆడలేడని నిర్వాహకులు తేల్చి చెప్పారు.

ఇంతకూ ఏమి జరిగిందంటే:

ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్ వరుసగా 6, 4 బాదేశాడు. అప్పటికే తీవ్ర అసహనంలో ఉన్న షకీబ్ ఆ తర్వాత బంతికి ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ముష్ఫికర్ బ్యాట్‌కి తాకలేదు.. వికెట్లకి దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అన్నాడు. కోపంతో షకీబ్ వికెట్లని గట్టిగా కాలితో తన్ని అంపైర్‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు.

ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో వర్షం మొదలవడంతో ఆ ఓవర్‌లో ఒక బంతి మిగిలి ఉండగానే అంపైర్లు ఆటని నిలిపివేశారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం 6 ఓవర్లు పూర్తి కావాల్సి ఉన్నందున.. ఆ ఆఖరి బంతిని వేయించాలని డిమాండ్ చేశాడు. కానీ అంపైర్లు తిరస్కరించారు. పట్టలేని కోపంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లని పీకేసి విసిరికొట్టాడు. ఇక ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత షకీబ్ అల్ హసన్ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన తప్పు ఇకపై రిపీట్ చేయనని క్షమాపణలు చెప్పుకొచ్చారు.


Next Story
Share it