సెంచరీ చెయ్యి.. అందరూ నోరు మూసుకుంటారు..!
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఈ సీజన్‌లో విమర్శల బారిన పడ్డాడు.
By - Medi Samrat |
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఈ సీజన్‌లో విమర్శల బారిన పడ్డాడు. అతని స్ట్రైక్ రేట్‌పై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దీని గురించి రహానేను ప్రశ్నించినప్పుడు, అతను తన స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడేవారు తనపై అసూయ పడుతున్నారని విచిత్రంగా స్పందించాడు. అతని ఈ సమాధానం భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు నచ్చలేదు.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో రహానే 167.50 స్ట్రైక్ రేట్‌తో 67 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఎనిమిది పరుగులతో ఆడుతున్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయి, రద్దయింది.
మ్యాచ్ తర్వాత రహానే అసూయతో చేసిన వ్యాఖ్య సెహ్వాగ్‌కు నచ్చలేదు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ సెహ్వాగ్ ఇలా అన్నాడు, "ఆటగాళ్లు అలాంటి మాటలు మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను. అతను కెప్టెన్ అని నాకు తెలుసు. కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం గురించి అడిగినప్పుడు, అతను సూటిగా సమాధానం ఇవ్వలేదు. అతను క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలని చెప్పాడు. ఇది నేను అర్థం చేసుకోగలను. ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తారు, ప్రశంసిస్తారు. కానీ మీరు అన్ని సందర్భాల్లోనూ తటస్థంగా ఉండాలి. ఇలాంటి గొడవలోకి దిగాల్సిన అవసరం ఏముంది?" అని సెహ్వాగ్ అన్నారు.
రహానేకు పాఠం చెబుతూ సెహ్వాగ్.. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌లను ఉదాహరణగా ప్రస్తావించారు. "ఈ వ్యక్తులు తమ విమర్శకులకు సమాధానం చెప్పాలనుకుంటారు, కానీ బచ్చన్ సాహిబ్ విమర్శకులకు ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. టెండూల్కర్ కంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఒక వార్తాపత్రిక అయితే ఎండూల్కర్ అని కూడా రాసింది. అయినా స్పందించలేదు.. అందుకే నువ్వు మౌనంగా ఉండటం మంచిది. సెంచరీ చెయ్యి, అందరూ నోరు మూసుకుంటారు. ప్రశాంతంగా ఉండి నీ పని నువ్వు చేసుకో. ఇలాంటి వాటికి స్పందించే అవసరం ఉందని నేను అనుకోవడం లేదు," అని సెహ్వాగ్ అన్నాడు.
కోల్‌కతా తమ తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. సొంతగడ్డపై తమ ఓటముల పరంపరకు మూడో మ్యాచ్‌లో బ్రేక్ వేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ వర్షం వారి అవకాశాలను దెబ్బతీసింది.