టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా ను వేధించిన భోజ్‌పురి నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ బెయిల్ పై విడుదలైంది. వెంటనే పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టింది. ముంబై ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. పృథ్వీ షా, అతడి స్నేహితులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సప్నా గిల్ ఫిర్యాదు మేరకు పృథ్వీ షా, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120b, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
ఫిబ్రవరి 15న ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో గొడవ జరిగింది. సెల్ఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో పృథ్వీ షా కారుపై సప్నా గిల్, ఆమె స్నేహితుడు శోబిత్ ఠాకూర్ దాడి చేశారని కేసు నమోదైంది. పృథ్వీ షా స్నేహితుడు ఆశిష్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 143, 148, 384, 506 కింద పోలీసులు కేసు పెట్టారు. ముంబైలోని అంధేరీ కోర్టు వీరికి ఫిబ్రవరి 20 వరకు కస్టడీ విధించింది. మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విన్నపాన్ని మేజిస్ట్రేట్ తిరస్కరించి, ఆమెకు బయిల్ మంజూరు చేశారు. బెయిల్ పై వచ్చిన వెంటనే పృథ్వీ షాపై సప్నా గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.