క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. సంజుకు అవకాశం దక్కేనా..?
Samson Will get a chance in 2nd T20I against Ireland.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2022 3:01 PM ISTటీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన టీమ్ఇండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. డబ్లిన్ వేదికగా నేడు(మంగళవారం) జరిగే రెండో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని హార్థిక్ సేన బావిస్తోంది. అయితే.. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌లో 12 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. నేటి మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది.
ఈ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేసేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌తో రాహుల్ త్రిపాఠి అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నాయి. తొలి టీ20లో పిక్క కండరాలు పట్టేయడంతో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయలేదు. అతడి స్థానంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే దీపక్ హుడా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మరి రెండో టీ20కి రుతురాజ్ అందుబాటులో ఉంటాడా..? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఐపీఎల్‌లో 17 మ్యాచుల్లో 458 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌కు ఈ మ్యాచులో అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇప్పటికే శాంసన్‌కు టీమ్ఇండియాకు ఆడిన అనుభవం ఉంది. అయితే..నిలకడ లేమి, సరైన సమయంలో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో భారత జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోలేకపోయాడు. సంజు లాంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉండాలని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. పెద్దగా రాణించని అక్షర్ స్థానంలో అర్ష్‌దీప్‌ను ఆడించొచ్చు. జట్టు కూర్పు పై కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ హార్థిక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.