చరిత్ర సృష్టించిన సామ్రాట్ రానా

సామ్రాట్ రానా కైరోలో చరిత్ర సృష్టించాడు. ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైన‌ల్‌లో గెలిచి సామ్రాట్ రాణా భారతదేశం త‌రుపున‌ మొదటి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

By -  Medi Samrat
Published on : 11 Nov 2025 6:50 PM IST

చరిత్ర సృష్టించిన సామ్రాట్ రానా

సామ్రాట్ రానా కైరోలో చరిత్ర సృష్టించాడు. ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైన‌ల్‌లో గెలిచి సామ్రాట్ రాణా భారతదేశం త‌రుపున‌ మొదటి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కూడా ఒలింపిక్స్‌లో భాగమే. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రాణా అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో రానా 243.7 స్కోరు చేసి 243.3 స్కోరు చేసిన చైనా ఆటగాడు హు కైని ఓడించాడు.

చరిత్ర సృష్టించిన తర్వాత రానా మాట్లాడుతూ.. 'నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కైరో నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. 2022లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నేను ఇక్కడ రెండు పతకాలు సాధించాను. ఇక్కడి వాతావరణం నాకు నచ్చింది. నేను ప్రతి షాట్ తర్వాత నా టెక్నిక్‌పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్ చాలా ఉత్కంఠగా సాగింది. రానా, హు కై, భారత షూటర్ వరుణ్ తోమర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరి క్షణాల్లో రానా ఓపిక పట్టడం ఫలించింది. తోమర్ కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తోమర్ 221.7 స్కోర్ చేశాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారతీయ షూటర్లు ఒకే ఈవెంట్‌లో పోడియంపై నిలవడం ఇదే తొలిసారి.

రాణా (586), తోమర్ (586), శ్రవణ్ కుమార్ (582)ల అద్భుతమైన ప్రదర్శనతో టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. భారత్ మొత్తం స్కోరు 1754. ఇటలీ రజతం, జర్మనీ కాంస్య పతకం సాధించింది. వ్యక్తిగత పోటీలో శ్రవణ్ 12వ స్థానంలో నిలిచాడు.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మను భాకర్‌, ఇషా సింగ్‌లు అద్భుతంగా ఆరంభించినప్పటికీ చివ‌రి వ‌ర‌కూ నిల‌వ‌లేకపోయారు. ఒలింపిక్ పతక విజేత మను భాకర్ 14వ షాట్ తర్వాత ఏడో స్థానానికి పడిపోయింది. ఇషా ఆరో స్థానంతో ఈవెంట్‌ను ముగించింది. అయితే ఇషా (583), మను (580), ప్రపంచ నంబర్-1 సురుచి ఇందర్ సింగ్ (577)ల బలంతో టీమ్ ఈవెంట్‌లో భారత్ 1740 స్కోరుతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

Next Story