వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్నానని అంటోంది స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. టోక్యో విశ్వక్రీడల క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో సైనా ప్రస్తుతం 22వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే టాప్-16లోపు ర్యాంకుండాలి. అయితే.. త్వరలోనే కీలక టోర్నీల్లో ఆడి టోక్యో బెర్త్ దక్కించుకుంటానన్న విశ్వాసముందని 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా చెప్పింది.
'అందరూ ఒలిపింక్స్ గురించే ఆలోచిస్తుంటారని తెలుసు. అది చాలా పెద్ద ఈవెంట్. కానీ దానికన్నా ముందు చాలా టోర్నీలు ఉన్నాయి. తిరిగి లయను అందుకుని, టాప్-20 షట్లర్లపై గెలవాల్సి ఉంది. ఒలింపిక్స్ కన్నా ముందు ఏడెనిమిది టోర్నీలు ఆడాలి. ఆ తర్వాత మాత్రమే ఒలింపిక్స్ గురించి ఆలోచించాలి. కానీ నేను తప్పక ఒలింపిక్స్ రేసులో ఉన్నా. బాగా రాణించాలనుకుంటున్నా. అందుకోసం బాగా కష్టపడుతున్నానని' సైనా చెప్పింది.
'జకోవిచ్, ఫెదరర్, నాదల్, సెరెనా వంటి గొప్ప ఆటగాళ్లు వయస్సు పెరిగే కొద్ది బాగా ఆడారు. నేను వారిని ఉదాహరణలుగా తీసుకున్నా. వారు సాధించినప్పుడు, నేను ఎందుకు సాధించలేను. చాలా సార్లు నేను ఆడలేనేమో అనుకున్నా. కానీ నన్ను నేను ప్రోత్సహించుకొని ముందుకు సాగా. నాకు ఫైట్ చేయడం ఇష్టం. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయలేను. ఇదే నా జీవితం, ఇదే నా ఉద్యోగం 'అని 30 ఏళ్ల సైనా చెప్పింది.