ఆసియా కప్ 2025 సూపర్ 4 సందర్భంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తుపాకీ ఎక్కుపెట్టి సెలెబ్రేషన్స్ జరుపుకోవడంపై తీవ్ర చర్చకు దారి తీసింది. సెప్టెంబర్ 21 ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ 10వ ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫర్హాన్ సిక్స్ కొట్టి తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రత్యేకమైన వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఓపెనర్ తన బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని డగ్ అవుట్ వైపు చూపిస్తూ, దానిని పేలుస్తున్నట్లుగా అనుకరించాడు. ఈ వేడుకను రెచ్చగొట్టేదిగా ప్రజలు భావించారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్ కోసం విలేకరుల సమావేశంలో ఫర్హాన్ ఈ వేడుక గురించి వ్యాఖ్యానించాడు.
తానేమీ సెలబ్రేషన్స్ విషయంలో పశ్చాత్తాపపడటం లేదని, తన తీరే అంత అని ఫర్హాన్ సమర్థించుకున్నాడు. ప్రజలు దానిని ఎలా తీసుకున్నారనే దాని గురించి తాను పట్టించుకోనని చెప్పాడు. భారత్‌తో జరిగిన మొదటి 10 ఓవర్లలో చేసినట్లుగానే, తన జట్టు దూకుడుగా క్రికెట్ ఆడటం కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు.