బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'

జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు.

By Medi Samrat
Published on : 6 Aug 2025 7:44 PM IST

బుమ్రా గైర్హాజరీలో భారత విజయం కేవలం యాదృచ్ఛికమే

జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ఇప్పటికీ 'అసాధారణ మరియు అద్భుతమైన బౌల‌ర్‌' అని ఆయ‌న వ్యాఖ్యానించాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌లో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సిరీస్‌లో తక్కువ అనుభవం ఉన్న బౌల‌ర్లు ఉన్నప్పటికీ, ఇంగ్లండ్‌తో భారత జట్టు 2-2తో సిరీస్ డ్రా చేసుకోగలిగింది.

బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేసి మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఆడి 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి 23 వికెట్లు పడగొట్టాడు. గణాంకాల పరంగా సిరాజ్ కంటే బుమ్రా చాలా ముందున్నాడు. బుమ్రా 48 టెస్టుల్లో 219 వికెట్లు తీయగా, సిరాజ్ 41 మ్యాచ్‌ల్లో 123 వికెట్లు తీశాడు. ప్రణాళిక ప్రకారం.. ఐదవ, ఆఖరి టెస్టుకు బుమ్రా గైర్హాజరు కావడం వల్ల అతని పనిభారం నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అయితే బుమ్రాకు సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోలేమని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.

మ్యాచ్ ఆద్యంతం జట్టు విజయంలో విశేష కృషి చేసిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను సచిన్ కొనియాడాడు. “అతను ఆడినప్పుడల్లా సహకారం అందించాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో చూస్తే.. నాలుగో ఇన్నింగ్స్‌లో ఐదో రోజు లంచ్‌కు ముందు బెన్‌స్టోక్స్‌ను అద్భుతమైన బంతితో అవుట్ చేశాడు. ఇదే 'టర్నింగ్ పాయింట్' అని నేను అనుకుంటున్నాను. చివరి టెస్టులో బ్యాటింగ్‌కి వచ్చే సమయానికి అతను అద్భుతమైన షాట్‌లు కొడుతూ 53 పరుగులు చేశాడు. అతను అద్భుతమైన పరుగుల వేగాన్ని కొనసాగించాడు. క్రీజులో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు నాలుగో టెస్టులో విజయం సాధించాడు. త్వరగా పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఐదో టెస్టులో ఆ ఘనత సాధించాడు. ‘బాగా ఆడాడు, వాశీ’. నేను చాలా ఆనందించాను.

మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా ప్రతిపాదనపై భారత్ నిరాకరించడం గురించి కూడా సచిన్ మాట్లాడాడు. రవీంద్ర జడేజా,వాషింగ్టన్‌లకు తమ సెంచరీలు సాధించేందుకు పూర్తి హక్కు ఉందని.. డ్రా మాత్రమే సాధ్యమైన పరిణామమని తెలిసిన తర్వాత ఆడటం కొనసాగించాలనే నిర్ణయం సరైన స్ఫూర్తితో తీసుకున్నారని అన్నాడు. 'వాషింగ్టన్, జడేజా సెంచరీలు సరైన స్ఫూర్తితో చేశారా అని ప్రజలు నాలుగో టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది ఎందుకు జరగకూడదు? వారు డ్రా కోసం ఆడుతున్నారు. అంతకుముందు ఇంగ్లండ్ ఒత్తిడిని సృష్టించింది. ఆ తర్వాత వీరిద్దరూ సెంచరీలు చేయడంతో సిరీస్‌ హోరాహోరీగా సాగింది. బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఇంగ్లండ్ ఫీల్డర్లు, బౌలర్లకు ఎందుకు విశ్రాంతి ఇవ్వాలి.? హ్యారీ బ్రూక్‌కి లేదా మరెవరికైనా బౌలింగ్ చేయాలనుకుంటే అది బెన్ స్టోక్స్ ఎంపిక, అది భారత్ సమస్య కాదన్నారు.

Next Story