WTC 2025: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత‌గా సౌతాఫ్రికా

ఐడెన్ మార్క్రామ్ సెంచరీ సహాయంతో ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్‌ను గెలుచుకుంది.

By Medi Samrat
Published on : 14 Jun 2025 5:30 PM IST

WTC 2025: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత‌గా సౌతాఫ్రికా

ఐడెన్ మార్క్రామ్ సెంచరీ సహాయంతో ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించింది. టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ఇది మూడో అతిపెద్ద విజయం. ఈ విజ‌యంతో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా నిలవగా.. ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను కాపాడుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించినా ఆస్ట్రేలియా జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాకు 282 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ విజ‌యంతో 27 ఏళ్ల విరామం తర్వాత దక్షిణాఫ్రికా ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ జట్టు చివరిసారిగా 1998లో నాకౌట్ ట్రోఫీ (ప్రస్తుతం ఛాంపియన్స్) టైటిల్‌ను గెలుచుకుంది. టెంబా బావుమా నేతృత్వంలోని జట్టు టైటిల్ కరువును ముగించి లార్డ్స్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా ఈ విజయంలో కెప్టెన్ బావుమా, ఐడెన్ మార్క్రామ్ సహకారం చాలా కీలకం. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి పునాది వేశారు.

మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 207 పరుగులకు ముగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. అనంత‌రం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్సు త‌ర్వాత ఆస్ట్రేలియా మొత్తం ఆధిక్యం 281 పరుగులు. చేధ‌న‌కు ద‌దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ర్యాన్ రికెల్టన్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిచెల్ స్టార్క్ అతనిని అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన వియాన్ మల్డర్ కూడా 27 పరుగులు మాత్రమే చేశాడు. స్టార్క్ అతడిని కూడా పెవిలియన్‌కు పంపాడు. 70 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ జట్టుకు భారీ భాగస్వామ్యం అవసరం కాగా.. ఐడెన్ మార్క్రమ్ టెంబా బావుమాతో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి పునాది వేశాడు.

దక్షిణాఫ్రికా రెండు వికెట్లకు 213 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించగా.. శనివారం 134 బంతుల్లో 66 పరుగులు చేసి ఔట్ అయిన బావుమా వికెట్‌ను ఆ జట్టు ఆరంభంలోనే కోల్పోయింది. బావుమాను పాట్ కమిన్స్ అవుట్‌ చేశాడు. ఆపై ట్రిస్టన్ స్టబ్స్(8) కూడా స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే మార్క్రమ్ అండగా నిలిచి జట్టును విజయపథంలోకి చేర్చాడు. కానీ అతను మ్యాచ్‌ని పూర్తి చేయలేక జోష్ హేజిల్‌వుడ్ బంతికి వికెట్ కోల్పోయాడు. మార్క్రామ్ 207 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్నీ చివరికి మ్యాచ్‌ను ముగించారు. త‌ద్వారా దక్షిణాఫ్రికా టైటిల్ కరువును ముగించారు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన‌ మార్క్‌రామ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

Next Story