సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన కివీస్‌..!

వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కోనార్ ఎస్టర్‌హూజెన్ మెరుపు ఇన్నింగ్స్, దానికి తోడు గెరాల్డ్ కోట్జీ పొదుపైన బౌలింగ్ కారణంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి టీ20లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది.

By -  Medi Samrat
Published on : 25 March 2026 5:00 PM IST

సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన కివీస్‌..!

వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కోనార్ ఎస్టర్‌హూజెన్ మెరుపు ఇన్నింగ్స్, దానికి తోడు గెరాల్డ్ కోట్జీ పొదుపైన బౌలింగ్ కారణంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి టీ20లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన కివీస్, ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కోల్పోయింది.

తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన తర్వాత న్యూజిలాండ్ బలంగా పుంజుకుని రెండో, మూడో టీ20లను గెలుచుకుంది. అయితే.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి ప్రోటీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానర్ ఎస్టర్‌హూజెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.

బుధవారం క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. నాలుగో ఓవర్‌లో టోనీ డి జోర్జీ (12) ఎల్బీడబ్ల్యూగా అవుటవడంతో ఆ జట్టుకు సాధారణ ఆరంభం లభించింది. ఆ తర్వాత వియాన్ ముల్డర్, రూబిన్ హెర్మన్ (39) కలిసి రెండో వికెట్‌కు 39 బంతుల్లో 55 పరుగులు జోడించారు. 11వ ఓవర్ తొలి బంతికి ముల్డర్ (31) క్యాచ్ అవుట్ అయ్యాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోనార్ ఎస్టర్‌హుయిజెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు 33 బంతుల్లో 227.27 స్ట్రైక్ రేట్‌తో 75 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. డయాన్ ఫోరెస్టర్ (21), జాసన్ స్మిత్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. కివీస్ బౌల‌ర్ల‌లో బెన్ సియర్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆ త‌ర్వాత 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెవాన్ జాకబ్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ జేమ్స్ నీషమ్ 24, డేన్ క్లీవర్ 22 పరుగులు చేశారు. టిమ్ రాబిన్సన్ 25 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా తరఫున గెరాల్డ్ కోట్జీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు తన నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. వియాన్ ముల్డర్, ఓట్నీల్ బార్ట్‌మన్ కూడా చెరో రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు.

Next Story