భారత జైత్రయాత్రకు బ్రేక్
SA beat IND by seven wickets.వరుసగా 12 టీ20ల్లో విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు జోరుకు సపారీలు బ్రేక్ వేశారు.
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2022 9:54 AM ISTవరుసగా 12 టీ20ల్లో విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు జోరుకు సపారీలు బ్రేక్ వేశారు. మరో మ్యాచ్ గెలిస్తే ప్రపంచ రికార్డు సొంతం కానుండగా.. సఫారీ బ్యాటర్లు డసెన్, మిల్లర్‌ల విధ్వంసానికి చేసేదేమీ లేకపోయింది. కొండంత లక్ష్యాన్ని ముందు ఉంచినా.. ఏ మాత్రం పసలేని బౌలింగ్ కారణంగా మ్యాచ్ చేజారిపోయింది. ఫలితంగా పంత్ సారధ్యంలో బరిలోకి దిగిన టీమ్ఇండియా ఓటమి చవిచూసింది.
ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (76; 48 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(36; 27 బంతుల్లో 1ఫోరు, 3 సిక్స్‌లు), హార్దిక్‌పాండ్యా(31 నాటౌట్; 12 బంతుల్లో2ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహారాజ్, నోర్టె, పార్నెల్, ప్రిటోరియస్ ఒక్కో వికెట్ తీశారు.
భారీ లక్ష్యఛేదనలో సఫారీలకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ బవుమా(10) ఆదిలోనే పెవిలియన్ చేరాడు. వన్ డౌన్‌లో వచ్చిన ప్రిటోరియస్(29) వచ్చి రావడంతోనే విరుచుకుపడ్డాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు భారీ సిక్స్‌లు బాదాడు. ప్రిటోరియస్‌ను హర్షల్, డికాక్‌ను అక్షర్ ఔట్ చేశారు. ఈ దశలో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చినట్లు కనిపించింది. అయితే.. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ మిల్లర్( 64 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇక్కడా అదే దూకుడు కొనసాగించాడు. ఈక్రమంలో 22 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. శ్రేయాస్ క్యాచ్ వదిలివేయడంతో జీవనధానం పొందిన డసెన్(75 నాటౌట్; 46 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్స్) తరువాత విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరి పోటిపడి బౌండరీలు బాదడంతో భారీ లక్ష్యం కరిగిపోయింది. మిల్లర్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం కటక్‌లో జరుగనుంది.