రాస్‌టేలర్ సంచలన ఆరోపణ.. డకౌట్ కావడంతో ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ ఓనర్ ముఖంపై కొట్టాడు
Ross Taylor Allegations Against IPL Team Owner.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడినప్పుడు ఓ ఫ్రాంఛైజీ యజమాని
By తోట వంశీ కుమార్ Published on 14 Aug 2022 3:16 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడినప్పుడు ఓ ఫ్రాంఛైజీ యజమాని తన ముఖం మీదు మూడు నాలుగు సార్లు కొట్టాడని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రాస్‌టేలర్ తన ఆటోబయోగ్రఫీ 'బ్లాక్ అండ్ వైట్'లో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ వారంలోనే ఈ బుక్ విడుదల కాగా.. పలు సంచలన విషయాలను అందులో వెల్లడించాడు రాస్.
ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టులో ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు చెప్పుకొచ్చాడు. మొహాలీ వేదికగా పంజాబ్ తో మ్యాచ్ ఆడుతున్నాం. పంజాబ్ 194 పరుగులు చేసింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగాం. అయితే.. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో నేను డకౌట్‌గా పెవిలియన్ చేరా. జట్టు లక్ష్యాన్ని అందుకోలేదు. ఇక మ్యాచ్ అనంతరం జట్టుతో పాటు సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్ హోటల్‌లో కూర్చున్నాం. అక్కడ షేన్ వార్న్, లిజ్ హుర్లే తదిరుతులు ఉన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ జట్టు యజమానుల్లో ఒకరు నా వద్దకు వచ్చారు. రాస్.. మీరు డకౌట్‌గా వస్తే మిలియన్ డాలర్లను ఇవ్వలేము. అంటూ నా మొహం మీద మూడు నాలుగు సార్లు చిన్నగా కొట్టాడు. అతడు నవ్వుతూనే ఉన్నాడు. నాకు గట్టిగా ఆ దెబ్బలు తగలేదని టేలర్ చెప్పాడు.
అయితే.. ఇది సరదాగా చేసిన పనిలా నాకు అనిపించలేదని, అప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయం పెద్దది చేయదలుచుకోలేదని టేలర్ తన ఆటో బయోగ్రఫిలో రాసుకొచ్చాడు. అయితే.. ఇది ఏ సంవత్సరంలో జరిగింది అనే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు. 2008 నుంచి 2014 వరకు ఐపీఎల్‌లో టేలర్ ఆడాడు. మొత్తంగా 55 మ్యాచులు ఆడిన టేలర్ 1017 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81 పరుగులు.